Chandra Babu And Pawan Tour: ఎన్డీఏ కూటమి భారీ విజయం తరువాత మూడోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబునాయుడు తొలిసారిగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు వస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అమలు చేసే ఉపాధి పనులు నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ సభల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వానపల్లిలో జరిగే గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. ఈ మేరకు ఇప్పటికే వానపల్లి గ్రామంలో సభ నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ బాలయోగి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రి కోనసీమకు వస్తున్న వేళ భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతపరమైన అంశాలపై జిల్లా ఎస్పీ కృష్ణారావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 


ఒకేసారి భారీగా గ్రామసభలు 


ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరో చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నిర్వహణకు సంబంధించి ఒకేసారి 13వేల 326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. మొత్తం 4500 కోట్లతో 87 రకాల పనులను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. వాటి వివరాలు తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని... అందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు గ్రామీణాభివృద్ది మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబు కోనసీమ జిల్లాలో జరిగే గ్రామసభలో పాల్గొంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నమయ్య జిల్లాలో జరిగే సభలో పాల్గొంటారు. 


సీఎం చంద్రబాబు కోనసీమ పర్యటన ఇలా.. 


ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు.11.40 గంటలకు కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసి హెలీప్యాడ్‌కు చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్‌ చేరుకుంటుంది. 11.45 వరకు ప్రజాప్రతినిధిలు, అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లి చేరుకుంటారు. 11.50కు వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు రోడ్డు మార్గంలో పల్లాలమ్మ టెంపుల్‌ మీదుగా చేరుకుంటారు. 11.50 నుంచి 1.30 వరకు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా గ్రామస్తులతో ఇంట్రాక్ట్‌ అవుతారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల మధ్య భోజన విరామం, ఆ తరువాత స్థానిక నాయకులతో ఇంట్రాక్షన్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వానపల్లి హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి 2.20 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 2.45 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌లో బేగంపేట విమానశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా జూబ్లిహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు. 


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం..


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మరుగుదొడ్లు ఇలా అనేక విధాలుగా వినియోగించే పరిస్థితి ఉండేది.. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం నిధులు కొంతవరకు వేరే పథకాలకు మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంది.. కేవలం పంటకాలువల్లో పూడిక తీయించడం, తుప్పలు తొలగించడం వంటి పనులకే పరిమితమవ్వగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ గత తరహాలోనే గ్రామాల్లో సీసీ రోడ్లు తదితర నిర్మాణలకు ఈ పథకం ద్వారా చేపట్టేందుకు సన్నద్ధమయ్యింది.. ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారించి గ్రామ సభలు నిర్వహించాలని సన్నద్ధమయ్యింది..


రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు...


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 2024ా25 ఆర్థిక సంవత్సరానికి సంబందించి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఈ క్రమంలోనే గ్రామాల్లో చేపట్టాల్సి ఉన్న పనులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లు ద్వారా ఆదేశించిన ప్రభుత్వం ఈ పనుల నిర్వహణ కోసమే ప్రతీ గ్రామంలోనూ గ్రామ సభ నిర్వహించాలని సూచించింది.. ప్రతీ గ్రామంలోనూ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, తుపాను షెల్టర్లు నిర్మాణం, పాఠశాలల ప్రహారీ నిర్మాణం, పశువుల షెడ్లు, ఉద్యాన పంటలు వేయించడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైయిన్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, ఇలా పలు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. వీటిని గ్రామ సభల్లో ప్రతిపాదించి వాటి అమలుకు పంచాయతీలు తీర్మానాలు చేయడం తద్వారా త్వరితగతిన పనులు చేపట్టడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.. 


చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు...


మూడోసారి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమకు తొలిసారిగా వస్తున్న క్రమంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలతోపాటు పక్క జిల్లాలు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా టీడీపీ, జనసేన శ్రేణులు, నాయకులు తరలివచ్చే అవకాశాలున్నందున పోలీసులు పటిష్టమైన బందోబస్తున్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నామినేటెడ్‌ పోస్టులకోసం ఎదురు చూస్తున్న టీడీపీ, జనసేన ఆశావాహులు కూడా చంద్రబాబును కలిసేందుకు క్యూ కట్టే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది.