కొట్టేసిన బంగారంతో ఏకంగా నగల దుకాణమే పెట్టాలనుకున్నారు ముగ్గురు కేటుగాళ్లు. వీరి ఆశ నెరవేరకపోగా పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యారు. విచారణలో ఈ ముగ్గురు అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యులు చెప్పిన వాస్తవాలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. 


బంగారు దుకాణాలు టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన బంగారు వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకి గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా చిక్కింది. వాహన తనిఖీలో భాగంగా పోలీసులు ఓ కారుని ఆపి నెంబరు చెక్ చేశారు.  తనిఖీ చేయగా అది నకిలీ నెంబర్ అని తేలింది. ఇంకా ఆరా తీస్తే పోలీసులకు దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.


యువకులైన నిందితులు ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యావంతులు. వారిలో ఒకరు ఎమ్మెస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవగా మరొకరు ఎమ్మెస్సి కంప్యూటర్స్ చదివాడు. దొంగతనాలకు అలవాటు పడ్డారు. మరో నిందితుడు బంగారపు పని చేసే వ్యక్తి.


నిందితులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తోటకూర రామ కృష్ణంరాజు (30), నరసాపురం సమీపంలోని లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన సుద్దుల కుమార్ రాజా (29), కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన బంగారపు పనివాడు విజయ్ పవార్ (31) ను పోలీసులు అరెస్టు చేశారు.
 
వీరి వద్ద నుంచి కోటి రూపాయలు విలువ చేసే 1360 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 కేజీల వెండి వస్తువులు, నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారు, బంగారం కట్ చేసి కరిగించే వస్తువులు, 40 వేల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


నిందితులు తోటకూర రామ కృష్ణంరాజు, సుద్దుల కుమార్ రాజా పాత నేరస్తులని ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరు 2016 సంవత్సరంలో దొంగతనం కేసులో పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయ్యారు. 10 నెలలు తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. 2018లో తోటకూర రామకృష్ణ రాజు, విజయ్ తవారును దొంగతనం కేసులో రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


జైలు నుంచి బయటకు వచ్చిన ముగ్గురు నిందితులు నేరాలు చేసి డబ్బు సంపాదించి కర్ణాటకలో జ్యూవెలరీ షాప్ పెట్టుకుని స్థిరపడాలని నిర్ణయుంచుకున్నారు. అందుకే 2019లో ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తోటకూర రామకృష్ణ రాజు, సద్దులా కుమార్ రాజా కలసి మళ్లీ దొంగతనాలు స్టార్ట్ చేశారు. దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను విజయ్ తవారు పవార్‌కి ఇవ్వగా, అతను కర్ణాటక తీసుకెళ్లి ఆ వస్తువులను అక్కడ అమ్మి సొమ్ము చేసుకొని వచ్చాడు.


ఒక కారును కొనుగోలు చేసి తోటకూర రామకృష్ణరాజు, సద్దుల కుమార్ రాజా ఇద్దరు కారులో వెళ్ళి రామచంద్రాపురం, అమలాపురం, రాజమండ్రి, భీమవరం సబ్ డివిజన్ పరిధిలో 25 నేరాలకు పాల్పడ్డారు. ఈ డబ్బుతో మంచి నగల దుకాణం పెట్టాలని వీళ్ల ఆలోచన.