Janasena Chief Pawan Kalyan | పిఠాపురం లో జరిగిన జనసేన 'జయకేతన ' సదస్సులో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి పూర్తిగా మౌనముద్రనే వహిస్తోంది. టిడిపిని తామే అధికారం లోకి తెచ్చామన్నట్టుగా సాగిన పవన్ కళ్యాణ్,నాగబాబుల ప్రసంగాలు టిడిపి క్యాడర్లో కొంత అసహనాన్ని కలిగించినా ముఖ్య నేతలు ఎవరూ తెరపైకి వచ్చి మాట్లాడింది లేదు. సాధారణంగా పార్టీ గురించి ఎవరు ఏ మాట మాట్లాడినా తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందిస్తుంటారు. పైకి చెప్పకపోయినా జనసేన సహకారం లేకపోయినా అధికారం లోకి వచ్చి ఉండేవాళ్ళమనే మాటలు టిడిపి కార్యకర్తల నుంచి కొన్నిచోట్ల వినబడుతూనే ఉన్నాయి.
జయకేతనంలో పవన్ కళ్యాణ్ స్పీచ్
ఒకానొక దశలో జనసేన టిడిపికి పడటం లేదని పవన్ కళ్యాణ్ అలకబూని క్యాబినెట్ మీటింగ్ కూడా రావడం లేదంటూ ప్రచారం తీవ్ర స్థాయిలో జరిగింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూటమి మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటుందని కుండ బద్దలు కొట్టేసారు. దానితో కుటుంబంలో అంతా సవ్యంగానే ఉందనే భావించారు అందరూ. కానీ శుక్రవారం రాత్రి జరిగిన 'జయ కేతనం' సభలో టిడిపిని కూడా అధికారం లోకి తెచ్చింది జనసేననే అన్నట్టుగా పవన్ చేసిన ప్రసంగం పై కచ్చితంగా టిడిపి సీనియర్ నేతలు స్పందిస్తారని భావించినా అలాంటిది ఏదీ జరగలేదు.
2019కు ముందు పరిస్థితి వేరు
2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జనసేన NDA కు మద్దతు ఇచ్చింది. కానీ 2019 ఎన్నికలకు ముందు ఆ మద్దతు ఉపసంహరించుకున్నారు పవన్ కళ్యాణ్. అప్పట్లో టిడిపి పై ఆయన కొన్ని విమర్శలు చేస్తే వెంటనే పవన్ పై విరుచుకుపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా ఇతర కీలక నేతలు. కానీ ఈరోజు పరిస్థితి వేరేలా ఉంది. పవన్ గాని జనసేన నాయకులు గాని టిడిపి అధికారం లోకి వచ్చిందని ఒకటికి రెండు సార్లు చెప్తున్నా టిడిపి మాత్రం సంయమనమే పాటిస్తోంది. దీనికి పార్టీ హై కమాండ్ నుండి వచ్చిన ఆదేశాలే కారణం అని టిడిపి అంతర్గత సమాచారం. ప్రస్తుతం కేంద్రంలోని బిజెపితో పవన్ కళ్యాణ్ చాలా ఘాడమైన దోస్తీలో ఉన్నారు.
పవన్, బీజేపీని నొప్పించే ఛాన్స్ లేదు
మరోవైపు అమరావతి పనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగాల్సి ఉంది. దానికి భారీ స్థాయిలో నిధులు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను గాని, కేంద్రంలోని బిజెపిని గాని నొప్పించే పనులు చేయడం టిడిపి అధిష్టానానికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి మాటలు చూసి చూడనట్టుగానే వదిలేస్తున్నారు. అలాగని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు స్థాయిని తగ్గించి మాట్లాడటం లేదు. ఏమాత్రం అవకాశం వచ్చినా గత ప్రభుత్వంలో చంద్రబాబు పడిన కష్టాల గురించి ఆయన జైలు జీవితం గురించి సానుభూతి వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. 40 ఏళ్ల విజినరీ అంటూ చంద్రబాబు సామర్థ్యాన్ని గుర్తు చేస్తూనే వస్తున్నారు. దీనితో జనసేనాని ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడే మాటలు కేవలం జన సైనికులను ఉత్తేజపరచడానికి మాట్లాడే మాటలుగానే టిడిపి అధిష్టానం చూస్తోంది.
అందుకనే పవన్ కళ్యాణ్ తమవల్లే కూటమి అధికారం లోకి వచ్చిందన్నట్టుగా ప్రసంగించినా దానిపై విమర్శలు చేయొద్దంటూ పార్టీ కీలక నేతలకు హై కమాండ్ నుండి ఆదేశాలు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు శనివారం మంగళగిరి లో స్వచ్ఛ ఆంధ్ర లో పాల్గొన్న నారా లోకేష్ పారిశుధ్య కార్మికులతో కలిసి టీ తాగుతూ " టీ పవనన్న గ్లాస్ లో ఇవ్వండి అంటూ " అడగడం వైరల్ అయ్యింది. ఇదంతా టిడిపి జనసేన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్న మెసేజ్ కేడర్ కు పంపడానికే అన్న విశ్లేషణలు ప్రస్తుతం సోషల్ మీరియా లో జోరుగా కొనసాగుతున్నాయి.