TDP Leaders Mahanadu at Rajamahendravaram:
జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ
ప్రపంచంలో తెలుగువారి గౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్, ఏ పాత్రలో నటించినా అందులో లీనమయ్యే వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. నాలుగేళ్లుగా ప్రతిపక్షాలను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారని మహానాడు రెండో రోజు కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ కనిపిస్తుంది. పింఛను రూ.3 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. సీఎం జగన్ తో పాటు రాష్ట్రంలో ఏ మంత్రికీ విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ రావాలన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.
రాక్షసపాలన నుంచి విముక్తి కల్పించాలి..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం పరిపాలించిన సీఎంగా, ప్రతిపక్షనేతగా సైతం అధికకాలం ఉన్న నేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని కోసం కలిసికట్టుగా పోరాడాదామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి తెస్తారన్నారు.
ఎటుచూసినా అవినీతిమయం.. అప్పులమయం
మహానాడు రెండో రోజు వర్షం కురిసింది. ఈ వర్షం.. అన్నగారు ఎన్టీఆర్ మనపై కురిపించిన పూల వర్షం అన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్, నన్నయ్య, కందుకూరి, కాటన్ దొర నడయాడిన ప్రాంతమిది అన్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సాధించిన నాయకుడు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రం జగన్ పాలనలో ఎటుచూసినా అవినీతిమయం.. అప్పులమయంగా తయారైందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.
నారా లోకేష్ సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తున్నారు, ఎన్నో ఆంక్షలను దాటుకుని యువగళం కొనసాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయనను నడవనిస్తే అది పాదయాత్ర అని.. నడవనివ్వకపోతే మాత్రం దండయాత్రేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో కూడా అదే ప్లాన్ కనిపిస్తోంది.
గతానికి భిన్నంగా టీడీపీ ఈసారి కార్యక్రమాలు చేపడుతోంది. ఎప్పుడూ ఎన్నికలకు ముందు విడుదల చేసే మేనిఫెస్టోనూ ఏడాది ముందుగానే ప్రకటించేస్తోంది. దానిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. కేవలం నవరత్నాల మీదనే దృష్టిసారించారే తప్ప మరే ఇతర విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదన్నది టీడీపీ చేస్తున్న విమర్శ. ఆ సమస్యలన్నింటినీ తీర్చేలా ఇప్పటి మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు.