స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినే చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టైన మొదటి రోజు నుంచి ఆయనకు సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వేడి వాతావరణం కారణంగా చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని వార్తలు వచ్చాయి. మొన్న డీహైడ్రేషన్ అయ్యారని, నిన్న అలర్జీ వచ్చిందని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఆరోపించారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చంద్రబాబు హెల్త్‌పై, జైలు అధికారుల తీర్పు ఆయన సతీమణి భువనేశ్వరి ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం , వయసు రీత్య సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఇప్పటి ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని... ఇలా బరువు తగ్గుతూ పోతే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో నీళ్లు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ సరిగా శుభ్రం చేయడం లేదని కూడా విమర్శించారు. ఇలాంటి వాతావరణమే అనారోగ్యానికి ప్రధాన కారణమని అన్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణం తన భర్త ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు కోడల నారా లోకేష్ భార్య బ్రహ్మణీ కూడా ట్వీట్ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో జైలులో ఉంచడం హృదయవిదారకరమైన ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి ఆయనకు ప్రమాదకరమన్నారు. ఆయన ఆరోగ్య, వయసు రీత్య మెరుగైన వైద్య సేవలు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆయనకు కావాల్సిన వైద్యం సకాలంలో అందడం లేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. విద్యానగర్‌లోని లోకేష్ క్యాంప్ సైట్లో యనమల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి ఇచ్చిన నివేదికలో ఏముంది.? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులిటెన్ బయటకు ఇచ్చారు.? చేయాల్సిన కనీస పరీక్షలు చేయలేదు..రక్త పరీక్ష కూడా చేయలేదు. ఆరోగ్యం బాగోలేకనే చర్మంపై దద్దుర్లు, అలర్జీ వచ్చింది. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుంచీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారని ఆరోపించారు.
హెల్త్ బులిటెన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలి.. కానీ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నారు. డాక్టర్లు పరిశీలించినట్లుగా ఆరోగ్య బులిటెన్‌లో లేదు. చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్ప డాక్టర్లు పరీక్షలు చేసినట్లు బులిటెన్‌లో లేదు. డిప్యూటీ సూపరింటెండెంట్ తన సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కడున్నాయి.? డాక్టర్ రిలీజ్ చేసిన మెడికల్ రిపోర్టు బయటపెట్టాలి.. కానీ పెట్టలేదు. జైలులో చంద్రబాబు ఉండే రూము, అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందన్నారు.
ఓవర్ హెడ్ ట్యాంక్‌కు బోరు నీళ్లు వెళ్తాయని.. ఆ ట్యాంకు శుభ్రం చేస్తున్నారో లేదో తెలీదు. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోంది. చంద్రబాబు జాతీయ స్థాయి నేత..ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి అని యనమల అన్నారు. డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఉన్నది ఉన్నట్లు చెప్పడంలేదు. 5 కేజీల బరువు తగ్గారు..మరో 2 కేజీలు తగ్గితే కిడ్నీ సమస్య తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధ పడితే తక్షణమే ఆసుపత్రిలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డస్ట్ ఎలర్జీ చంద్రబాబుకు ఉంది. డీఐజీకి ఏం చెప్పినా తమకుపై నుంచి ఒత్తిడి ఉందని చెప్తున్నారన్నారు.
ప్రాక్టీసింగ్ లాయర్‌గా తాను చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లొచ్చు..కానీ అనుమతించడం లేదన్నారు యనమల. అర్హత సర్టిఫికేట్ ఇచ్చినా ఒప్పుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు పూర్తిగా పరీక్షలు చేయాల్సి ఉంది. చంద్రబాబు అనారోగ్యంపై లీగల్‌గా కూడా వ్యవహరిస్తాం. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు కూడా మార్పులు చేసి సొంత రిపోర్టులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు కాకుండా సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారు.? డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఎందుకివ్వడం లేదు.? టెస్టు చేసినప్పుడు డాక్టర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో తప్పుడు రిపోర్టు విడుదల చేశారు. చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చి..కోలుకునేదాకా డాక్టర్ల సమక్షంలో ఉంచాలన్నారు.
డస్ట్ వల్ల ఇంకా ఎలర్జీ పెరిగే అవకాశం ఉందన్నారు యనమల. వాళ్లు ఏం మందులు ఇచ్చారో కూడా తెలీదు.. కనీసం వ్యక్తిగత డాక్టర్లకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఏం మందులు ఇచ్చారో అనుమానం ఉంది. చంద్రబాబు వద్దకు వ్యక్తిగత డాక్టర్లను అనుమతించాలి. మెడికల్ రిపోర్టు రాసే అధికారం సూపరింటెండెంట్‌కు ఎవరిచ్చారు.? ఆరోగ్య సమస్యపై కోర్టును కూడా ఆశ్రయించి బుద్ధి చెప్తాం. చంద్రబాబు ఆరోగ్య పరీక్షలు చేసి డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఎక్కడుంది.? చంద్రబాబు ఆరోగ్యం పాడైనా ఫర్వాలేదన్న కక్షపూరిత వ్యవహారంలో ప్రభుత్వం ఉంది. ఏయే మందులు ఇస్తున్నారో కూడా చూపించడం లేదు. రూల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జైలును సందర్శించవచ్చు..కానీ అనుమతించడం లేదు.’’ అని రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.