Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ను కోలమూరు గ్రామస్థులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోలమూరు గ్రామ ప్రజలు నారా లోకేశ్ ముందు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మొరపెట్టుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో చాలా మంది ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్నట్లు గ్రామస్థులు చెప్పుకొచ్చారు. ఆక్వా రైతులు అందరికీ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, కోలమూరులో 33 కేవీ సబ్ స్టేషన్ ఉన్నా.. అధిక విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ కోతల సమస్యతో రొయ్యలు డీఓ సమస్యతో చనిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. లో ఓల్టేజీ ఉండటంతో ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయన్నారు. పంట కాల్వల్లో పూడిక పేరుకుపోతోందని, పూడిక తీయకపోవడంతో పంటలకు సరిగా నీరు రావడం లేదని నారా లోకేశ్ ముందు మొరపెట్టుకున్నారు. వరి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పండిన పంటలకు పరదాలు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిచి మొలకలు వస్తున్నాయని వాపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పెన్షన్లు తొలగిస్తున్నట్లు చెప్పారు. నాసిరకం మద్యం తాగడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదుట తమ సమస్యలను ఏకరువుపెట్టారు.
గ్రామస్థుల సమస్యలన్నీ విన్న నారా లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా నిదులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే వాటిని వినియోగించుకోలేని చేతగాని సీఎం జగన్ మోహన్ రెడ్డి అని నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ 24 గంటల పాటూ మంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన లేదని విమర్శలు గుప్పించారు.
Also Read: AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే, విద్యుత్ కోతల నేపథ్యంలో నిర్ణయం
టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత లో-ఓల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రజలకు, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. నీరు-చెట్టు ద్వారా టీడీపీ హయాంలో కాల్వల్లో పూడిక తీయించే వాళ్లమని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని మరుగున పడేశారని ఆరోపించారు. నీటి తీరువా పెంచి రైతుల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. సాగు నీటి కాల్వలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కాల్వల మరమ్మతులు, పూడికతీత చేపడతామని చెప్పుకొచ్చారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామన్నారు. రకరకాల సాకులు చూసి 6 లక్షల పింఛన్లను రద్దు చేశారని జగన్ సర్కారుపై మండిపడ్డారు. వారందరికీ తిరిగి పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో జె బ్రాండ్ల మద్యాన్ని నిషేధిస్తామని అన్నారు.