Chintamaneni Prabhakar Threatening Calls: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఆయన్ను హత్య చేసేందుకు ఒక షూటర్ ను ప్రభుత్వం నియమించిందని చింతమనేని ఆరోపిస్తున్నారు. ఆ మేరకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ‘‘నిన్ను హత్య చేసేందుకు ఓ షూటర్‌ని మా బాస్‌ నియమించాడు’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడని చింతమనేని చెబుతున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.


అంతేకాక, చింతమనేని ఏలూరు మొబైల్ కోర్టులో ఓ ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. ‘‘నన్ను ఎన్‌ కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నాలు చేసింది. టీడీపీ నాయకులు కనుక స్పందించకపోయి ఉంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. నా తరపు న్యాయవాదికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి వార్నింగ్‌ లు ఇచ్చారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నేను ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు అందుకు సహకరించిన 21 మందిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఏలూరు మొబైల్‌ కోర్టులో చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేటు కేసు ఫైల్ చేశారు.