TDP Chief Chandrababu Custody extends:


ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. అయితే రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటివి సాధారణంగా జరుగుతాయని, కోర్టు ఆధీనంలో ఉంటారని భావించాలని పేర్కొంటూ కోర్టు 11 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించారు. 


వరుస పిటిషన్లతో కోర్టు సమయం వృథా అవుతుందని, విచారణలో జాప్యం జరుగుతుందని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని కోర్టు చంద్రబాబును అడిగింది. ప్రాథమిక సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని చంద్రబాబు అడిగారు. విచారణ సమయంలో వివరాలను బయటపెట్టడం సరికాదని చంద్రబాబుకు న్యాయమూర్తి సూచించారు. అయితే సీఐడీ అధికారులు తమ విచారణలో సేకరించిన వివరాలను కోర్టుకు సమర్పించారని న్యాయమూర్తి చెప్పారు. ఇప్పుడే అంతా అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని, కేవలం విచారణ మొదలైందని.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని బాబుతో జడ్జి అన్నట్లు తెలుస్తోంది. 


అంతకు ముందు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ విచారణ రెండో రోజు ముగిసింది. తొలి రోజు శనివారం చంద్రబాబును దాదాపు 50 ప్రశ్నలు అడగగా, రెండో రోజు ఆదివారం సైతం అంతకుమించి సీఐడీ అధికారులు టీడీపీ అధినేతపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు నేటితో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ ముగియనుంది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచింది సీఐడీ. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించి చంద్రబాబు నుంచి సీఐడీ కొన్ని వివరాలు రాబట్టారు.


డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎలా కేటాయించారని సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు ప్రశ్నించారు.  షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపుపై సీఐడీ తమ అనుమానాలను విచారణలో ప్రస్తావించింది. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు. ప్రాజెక్టు విలువను ఎలా నిర్ణయించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారని సీఐడీ చంద్రబాబును ప్రశ్నించింది. జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు. 13 చోట్ల నోట్ ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టింది. అయితే విచారణకు చంద్రబాబు పూర్తి స్థాయిలో సహకరించలేదని, మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు.


సుప్రీంకోర్టులో చంద్రబాబు  క్వాష్ పిటిషన్
చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఇదివరకే దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది.