పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. తమ భూముల్లో అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులే అక్రమరవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 


సీఎంకు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్న అంశాలు:-
• యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో తమకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.
• వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు.
• ఈ తవ్వకాలను నిరసిస్తూ 6వ తేదీన చించినాడ దళితులు నిరసనలకు దిగితే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. శాంతియుత నిరసనలకు దిగిన వారిని గాయాల  పాలుచేశారు. 
• ఈ లాఠీ చార్జ్‌లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందిoచకపోగా బాధితులను కులంపేరుతో దారుణంగా దూషించారు. 
• తీవ్ర గాయాలు అయిన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
• మెడికో లీగల్ కేసుగా వైద్యులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, తీవ్ర గాయాలతో రక్తస్రావం అయిన బాధితుల నుంచి పోలీసులు ఎటువంటి వాంగ్మూలం తీసుకోలేదు.
• రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది
• శాంతియుతంగా ఆందోళన చేస్తున్న దళితులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన అవసరం ఏంటి?
• నిరసన తెలుపుతున్న దళితులను పోలీసులు అక్రమంగా నిర్బంధించాల్సిన అవసరం ఏమిటి?
• సమీపంలో ఆసుపత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ, గాయపడిన బాధితులను సంఘటన స్థలం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసువెళ్లాల్సిన అవసరం ఏమిటి?
• గాయపడిన బాధితుల నుంచి నిబంధనల ప్రకారం వాంగ్మూలం తీసుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు?
• అక్రమ తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది?
• ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? 
• ఈ సందర్భంలో దళిత మహిళ రాపాక బొజ్జమ్మ ఛాతీపై పోలీసులు కాళ్లతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె అసుపత్రి పాలయ్యారు. 
• పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
• అక్రమ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మట్టిని తరలిస్తున్న 9 ట్రక్కులను స్థానికులు పట్టుకున్నారు.
• ఈ అక్రమ రవాణాపై పక్కా ఆధారాలు లభ్యమైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• ప్రతి 10 మీటర్ల కు ఒక పోలీసును పెట్టి అక్రమ రవాణాకు సహాయం చేస్తున్నారు.
• పట్టపగలు జరుగుతున్న దోపిడీకి పోలీసులు అందిస్తున్న సహకారం పోలీసుల తీరును చాటి చెబుతోంది.
• నిబంధనలకు విరుద్దంగా గోదావరి నది నుంచి 200 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరుపుతున్నారు.
• భారీ రవాణా వాహనాలు నది గట్టుపై ప్రయాణించడం వల్ల రివర్ బండ్ దెబ్బతింటుంది.
• మట్టి అక్రమ రవాణా కోసం కొన్ని చోట్ల ఏకంగా గ్రావెల్ రోడ్లను నిర్మించారు. దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ధిక్కరించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
• పేదల ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తరలింపు అని చెపుతున్నా... ఇక్కడ తవ్విన దాంట్లో 80 శాతం మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.
• గోదావరి నది ఒడ్డున విచక్షణారహితంగా మట్టిని తవ్వడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల నది గట్టు ధ్వంసమైంది.
• గట్టు విధ్వంసం వల్ల ఆకస్మిక వరద ముప్పుకు అవకాశం ఉంది.
• ఈ మొత్తం ఘటనలో దళితులను గాయపరిచి, దుర్భాషలాడిన సంబంధిత పోలీసు అధికారులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
• అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలి.
• అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలి