Picnic News : కార్తీక మాసం వచ్చిందంటే చాలు పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు క్యూ కడుతుంటారు. ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో కొందరు కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలకు తరలివచ్చే అవకాశాలుండగా స్నేహితులతో కూడబలుక్కుని మరీ ప్రత్యేక వాహనాల్లో మరికొందరు తరలివస్తుంటారు. అలా వచ్చిన వారిలో కొందరు అజాగ్రత్త వల్ల, మరికొందరు పరిస్థితులు అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.   


ఈ పర్యాటక ప్రాంతాల్లో అనేక అంతులేని విషాదాలు మనం చూశాం. ఏటా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు సంఖ్య తగ్గడం లేదు. కొందరు తల్లిదండ్రులకు ఎదిగివచ్చిన బిడ్డలు దూరమై కడుపుకోత మిగుల్చుతుండగా మరికొందరు కన్నవారిని, కంటికి పాపలా కాపాడాల్సిన భార్య బిడ్డలకు దూరమై అనాథలను చేసి వెళ్లిపోయే పరిస్థితి ఉంది.  అందుకే పర్యాటక ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండగలిగితే ఆహ్లాదం కోసం చేసే విహార యాత్రలు విషాదాంతం కాకుండా మంచి జ్ఞాపకంగా మిగులుతాయి. 


సముద్రం వద్ద ఈ జాగ్రత్తలు అత్యవసరం..
కార్తీక మాసంలో పిక్‌నిక్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే ప్రదేశం సముద్రతీరం.. ఏపీలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్నందున ఎక్కడ చూసిన పిక్‌నిక్‌ స్పాట్‌లే కనిపిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది నుంచి అద్దరిపేట వరకు సుమారు 148 కిలోమీటర్లు మేర సముద్రతీరం విస్తరించి ఉంది. ఈ తీరం వెంబడి సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. 


గడచిన పదేళ్ల కాలంలో ఓడలరేవు, అంతర్వేది, యానాం, కాకినాడ, ఉప్పాడ బీచ్‌ల్లో పదుల సంఖ్యలో సందర్శకులు సముద్రంలో గల్లంతైన ఘటనలు ఉన్నాయి. సముద్ర స్నానాలు చేసేటప్పుడు అత్యుత్సాహం ఉండకూడదని, మితిమీరిన విశ్వాసంతో సముద్రంలోతుల్లోకి వెళ్లడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి చేసే సముద్ర స్నానాలు ప్రమాదకరమంటున్నారు. ఇలా చేయడం వల్ల సముద్రంలోకి వెళ్లి గల్లంతైన వారే ఎక్కువ ఉంటున్నారని అంటున్నారు. కొందరు విద్యార్థులు సాహసం చేస్తున్నట్లు భావించి సముద్రం లోతుల్లోకి వెళ్లడం వల్ల గల్లంతవుతున్నారు. తీరంలో వచ్చే కరెంట్‌ టైడ్స్‌ వల్ల మనిషిని లోపలికి లాక్కెళ్లే ప్రమాదం ఉందని అటువంటి రాకాసి కెరటాలు వచ్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. 


జలపాతాల వద్ద జరజాగ్రత్త..
ఇటీవలే మారేడుమిల్లి జలతరంగణి జలపాతం వద్ద ఏలూరు ఆశ్రమం వైద్యకళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.  అందుకే జలపాతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఒక్కసారిగా వరద నీరు పోటెత్తే ఛాన్స్ ఉందని వాతావరణ పరిస్థితులు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జలపాతాల వద్ద నాచు పట్టి జారిపోయే ప్రమాదం ఉంది.  అలాంటి ప్రమాదకరంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని అంటున్నారు. ఆహ్లాదాన్ని ఆస్వాదించాలే కాని అత్యుత్సాహానికి దిగి ప్రమాదాల బారిన పడకూడదని పోలీసులు హితవు పలుకుతున్నారు.  



ఆటవిడుపులో అడుగడుగునా ప్రమాదాలే...
కార్తీకమాసంలో గోదావరిలో పుణ్యస్నానాలు, చెరువుల్లోను, కాలువల్లోనూ పుణ్యస్నానాలు భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం స్నానఘట్టాలున్నచోటే పుణ్యస్నానాలు చేయడం శ్రేయస్కరం. స్నానఘట్టాలున్నచోట కూడా మెట్లు దెబ్బతిని ముందుకు పడిపోయే ప్రమాదం ఉందని అనువైన చోట, ఒక్కసారి పరిశీలించుకుని దిగడం మంచిదని సూచిస్తున్నారు..


ఆకతాయిలతో అసలుకే ప్రమాదం..
కార్తీకమాసంలో వనసమారాధన అనగానే చెట్లు, పుట్టలు ఉన్నచోటకు వెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆహ్లాదంతోపాటు ఆధ్మాతికంగా గడిపేందుకు ఎక్కువగా మక్కువ చూపుతారు. చెట్లు, చేమలున్నచోట ఎక్కువగా తేనె పట్టులు ఉంటుంటాయి. అయితే వాటిపై పిల్లలు, ఆకతాయితనం ఉన్న పిల్లలు రాయిపెట్టి కొట్టడం వంటివి చేస్తుంటారు.. అందుకే ముందుగానే పిల్లల్ని హెచ్చరించడం వంటివి చేయాలంటున్నారు.. గతంలో చోటుచేసుకున్న ప్రమాదాల్ని ఒకసారి పరిశీలిస్తే వనసమారాధనలో భోజనాలు చేస్తుంటే ఒక ఆకతాయి చేసిన పనికి తేనెటీగలు దాడికి అంతా ఆస్పత్రిపాలు అయ్యార. మృత్యువాత పడిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తున్నారు. మరో పక్క విషసర్పాలుతోనూ ప్రమాదం ఉంది. కనుక వాటికి ఆవాసంగా ఉన్న పొదలు, పుట్టలు ఉన్నచోటకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు..



వెళ్లే వచ్చేటప్పుడు జాగ్రత్త
పిక్‌నిక్‌లకు వెళ్లేటప్పుడు కొందరు తమకు సమీపంలో ఉన్న ప్రదేశాల్లో వేడుకలు చేసుకుంటే... మరికొందరు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి వారి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మద్యం తాగి వాహనాలు నడపడం మంచి కాదని చెబుతున్నారు. కార్లలో వెళ్లే వాళ్లు సీటు బెల్టు పెట్టుకోవడం, టూ వీలర్స్‌లో వెళ్లే వాళ్లు హెల్మెట్‌ ధరించాలని సూచిస్తున్నారు. వాహనాల్లో వెళ్లే వాళ్లు ఆ బండి కండీషన్ చెక్‌ చేయాలని చెబుతున్నారు. 


Also Read: కార్తీక మాసంలో ఆలయాల సందర్శనకు ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్- దివ్య దక్షిణ్‌ యాత్ర పేరిట 9 రోజుల టూర్