కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో రోజూ భారీ సంఖ్యలో భక్తు వస్తూ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. శుభకార్యాలు జరిపించుకొని వెళ్తుంటారు. అలాంటి దేవాలయం విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.  


భక్తులపై మరింత భారం పెరిగేలా దేవస్థానం అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శుభకార్యాల కోసం పురోహితులు, భజంత్రీలు, అలంకరణ ఏర్పాట్లు ఇలా అన్నీ వేలం పాట ద్వారా కాంట్రాక్టుదారునికి అప్పగించే చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీన్నే తణుకు వారాహి బహిరంగ సభ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించారు. అన్నవరం విషయంలో తీసుకున్న చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, హిందూ ధర్మం జోలికి వస్తే సహించేది లేదని గట్టిగానే హెచ్చరించారు..


అన్నవరం పుణ్యక్షేత్రంలో దేవస్థానం తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యాపార దృక్పథంలో తీసుకున్నదేనని భక్తులు మండిపడుతున్నారు. రత్నగిరిలో వివాహాలు, ఉపనయనాలు ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు సౌకర్యాలను కాంట్రాక్టుదారుడు సమకూర్చేలా రూల్ తీసుకురాబోతున్నారు. స్వామి సన్నిధిలో నిర్వహించే శుభకార్యాలకు భజంత్రీలు, పురోహితులు, అలంకరణ మండపం, భోజనాలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే సమకూర్చేలా కసరత్తు ప్రారంభించారు. దీని అమలుకు టెండర్లు పిలిచారు. 


ఈ ప్రక్రియలో భక్తుల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును కాంట్రాక్టుదారునికి దేవస్థానం చెల్లిస్తుంది. ఇందులో భాగంగానే జూన్‌ నెలలో ఇప్పటికే డోలు, సన్నాయి మేళం ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు వేలం పాట నిర్వహించారు. దీనికి రూ.2.16 కోట్లు మేర చెల్లించేందుకు కాంట్రాక్టుదారుడు ముందుకు వచ్చాడు. 


ఈ ప్రణాళికలో భాగంగా పురోహితులు ఏర్పాటుకు టెండర్లు నిర్వహించారు. పలు కారణాలతో దాన్ని రద్దు చేశారు. ఈ చర్యలే ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. 


ఈ విధానంలో పెరగనున్న భారం.. 


అన్నవరం పుణ్యక్షేత్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే ఫుణ్యఫలం అనేది భక్తుల నమ్మకం. అందుకే రత్నగిరిలో ప్రతీ ఏటా వేల వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, ఇతర శుభకార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు పురోహితులు ప్రధాన భూమిక పోషిస్తారు. అన్నవరం కొండపై శుభాకార్యాలు చేసుకునేవారు పురోహితులను బయట నుంచి తెచ్చుకుంటే వివాహానికి రూ.5,000, ఉపనయనాలకు రూ.2,000 చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇదే తరహాలో పూర్తి స్థాయి సన్నాయి మేళానిరి రూ.12,000, సగం సన్నాయి మేళానికి రూ.6,000 చొప్పున రేటు నిర్ణయించారు. అదే బయట నుంచి గనుగ సన్నాయి మేళాన్ని తెచ్చుకుంటే అదనంగా రూ.3,000 వసూలు చేయాలని నిర్ణయించారు. 


ఇదంతా సమర్పణ పేరిట అదనపు వసూళ్లు చేస్తుండగా ఆధ్యాత్మిక కోణంలో చూడాల్సిన దేవస్థానం అధికారులు వ్యాపార దృక్పథంలో చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..


కచ్చితత్వం కోసమే అంటున్న అధికారులు..


రత్నగిరి కొండపై జరుగుతోన్న వివాహాల విషయంలో కచ్చితత్వం కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అసలు కొండపై ఎంత మంది పురోహితులు ఉన్నారు, ఇతర పురోహితులు కొండపైకి ఎంత మంది వస్తున్నారన్న విషయంలో స్పష్టత కోసమేనని అంటున్నారు. కొండపై జరుగుతున్న కొన్ని వివాహాలు వివాదస్పద మవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవలే ఓ బాలిక వివాహం గురించి జిల్లా కలెక్టరు సైతం ఆరా తీశారని చెబుతున్నారు. స్థానిక పురోహితులు, సన్నాయి మేళాలను ప్రోత్సహించాలనేది కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇది భారంగా మారతుందంటున్న నేపథ్యంలో బయట పురోహితులను తీసుకువస్తే వసూలు చేయాలనుకున్న రూ.5,000కు బదులు కేవలం రూ.1500 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు.


పురోహితుల ఏర్పాటుకు వేలంపాట తగదు...
అన్నవరం దేవస్థానంలో శుభకార్యాలు చేయించేందుకు పురోహితుల కోసం కాంట్రాక్టుదారుని ద్వారా ఏర్పాటు చేయాలనుకోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు అన్నారు. వేలం పాట నిర్వహించి కాంట్రాక్టుదారుని ద్వారా పురోహితులను ఏర్పాటు చేయడం విరమించి గత విధానాన్ని అమలు చేయాలని ఆలయ ఈవోకు వారంతా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీసత్యదేవ వ్రత పురోహిత సంఘం మాత్రం దేవస్థానం ప్రవేశపెట్టిన విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నామని తెలిపింది. అన్నవరం దేవస్థానంలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునేందుకు పురోహితులను ఏర్పాటు చేయడానికి దేవస్థానం విధానం ద్వారా మేలే జరుగుతుందన్నారు. టెండరు విధానంలో అర్ధమైన పురోహితులు, వైదిక సిబ్బందిని సమకూర్చుకోవడంలో తప్పుపట్టడానికి ఏమీ లేదని సంఘ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ స్పష్టం చేశారు.