రోజూ మద్యం తాగి వచ్చి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా సొంత కూతురి పట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ భర్తను చంపేసింది. చెంబుతో తలపై కొట్టి హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు..
అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఇసుకపట్ల రామకృష్ణ స్థానికంగా కొబ్బరి దింపు కార్మికునిగా పనిచేసుకుంటున్నారు. అతని భార్య సత్యనారాయణమ్మ కూలి పనులకు వెళ్తుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంత కాలంగా రామకృష్ణ(34) బాగా మద్యానికి బానిస అయ్యాడు. కొబ్బరి దింపుల ద్వారా వచ్చిన కూలి డబ్బులతో ప్రతీ రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. రామకృష్ణ ఇంట్లో తరచూ గొడవలు పడుతుండేవాడు.
శుక్రవారం బాగా మద్యం సేవించి వచ్చిన రామకృష్ణ భార్యతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన భార్య సత్యనారాయణమ్మ చెంబుతో తలపై మోదడంపై కిందపడిపోయాడు. అక్కడి నుంచి దొర్లి వాకిట్లో పడి మృతి చెందాడని నిందితురాలు చెబుతుంది.
కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
బాగా మద్యం తాగి వచ్చిన రామకృష్ణ సొంత కూతురి పట్లా అసభ్యంగా ప్రవర్తించబోయాడని నిందితురాలు చెబుతోంది. శుక్రవారం రాత్రి బాగా తాగి వచ్చి ఇంట్లో గొడవకు దిగాడని, ఆ తరువాత అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో వచ్చి నిద్రిస్తున్న కుమార్తె పట్లా అసభ్యంగా ప్రవర్తించబోయాడని ఆరోపిస్తోంది. అందుకే చెంబుతో దాడి చేసానని పోలీసులకు తెలిపింది. ఎంత తాగి వచ్చి గొడవకు దిగినా భరించానని, కుమార్తె పట్లా అసభ్యంగా ప్రవర్తించే సరికి కోపంతోనే చెంబుతో కొట్టానని చెబుతోంది. అయితే చనిపోతాడని అనుకోలేదని నిందితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ సంఘటనపై అయినవిల్లి ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.