సఖినేటిపల్లి: ఇటీవల రష్యాలో సునామీ సృష్టించిన విధ్వంసాన్ని చూశాం.. అంతకుముందు జపాన్, ఇండోనేషియాలో సునామీ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అందుకే సునామీ గురించి ఏ హెచ్చరిక తెలిసినా చివురుటాకుల్లా వణికిపోతుంటారు తీరప్రాంత ప్రజలు.. ఇప్పడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతంలో ముఖ్యంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంతంలోని స్థానిక ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అంతర్వేది తీరంలో సముద్రం ఏకంగా 500 మీటర్లు మేర వెనక్కు వెళ్లడం.. ఇది దేనికి సంకేతం.. అంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది.. సముద్రం ఎంత మేరకు వెనక్కు వెళితే అంత ప్రమాదమని, అంతేస్థాయిలో ముందుకు రాకాసి అలలు విరుచుకుపడతాయని ప్రచారం జరుగుతుండడంతో ఈ నేపథ్యంలోనే అంతర్వేది తీరప్రాంతంలో సునామీకు సంబందించిన భయం వెల్లువెత్తుతోంది.. అంతర్వేది అనగానే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఫేమస్ కాగా ఇక్కడ సముద్రం వెనక్కు వెళ్లిందన్న సమాచారం తెగ వైరల్ అవుతోంది..
ఇంతకీ అంతర్వేది తీరంలో ఏం జరిగిందంటే...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది తీరప్రాంతంలో రెండురోజులుగా వింత పరిస్థితి చోటుచేసుకుంది.. సముద్రం సుమారు 500 మీటర్లు మేరకు వెనక్కు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.. దీంతో తీర ప్రాంతం మొత్తం మైదానంలా మారింది.. అంతేకాకుండా వెనక్కు వెళ్లిన చోట అడుసులా మారి బురదతో నిండిపోయి కాలుపెడితే అడుగుమేర కిందికి దిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా ఇలాగే ఉండిపోవడం తీరం నుంచి చూస్తే ఎక్కడో అలలు తీవ్రత ఉన్నట్లు కనిపిస్తుండడంతో ఏమయ్యిందో తెలియక తెగ కలవరానికి గురవుతున్నారు.. కానీ స్థానిక మత్స్యకారులు యధాతధంగానే తమ చేపలవేటను సాగిస్తుండగా వారు దీనిపై ఆందోళన అనవసరమని కొట్టి పారేస్తున్నారు.. కానీ తీరానికి వెళ్లిన వారు మాత్రం సువిశాల తీరాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ అక్కడ ఎక్కువ సేపు గడిపేందుకు ఇష్టపడడం లేదు.. ఎందుకంటే ఏక్షణంలో సునామీ విరుచుకుపుడుతుందోనని తెగ ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు..
అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కువెళ్లడం కొత్తేమీ కాదు..
నిజానికి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లడం ఇప్పుడిదే కొత్తకాదు... గతంలో చాలా సార్లు ఇటువంటి పరిస్థితి కనిపించింది.. గత ఏడాది కూడా సరిగ్గా ఇలానే సముద్రం 500 మీటర్లు మేర వెనక్కు వెళ్లి తీరప్రాంతం అంతా మైదానంలా మారింది.. దీంతో అప్పుడు కూడా ఇది సునామీకు సంకేతం అన్నట్టుగా తెగ ప్రచారం జరిగింది.. దీనికి తోడు సోషల్ మీడియాలో అయితే ఈవీడియోలు మరింత వైరల్ అయ్యాయి.. అయితే రెండు రోజుల వ్యవధిలోనే సముద్రం సాధారణ స్థితిలోకి వచ్చింది. ఒకప్పుడు ఇప్పడున్నట్లే 500 మీటర్లు లోపలకు ఉండే సముద్రం కాలక్రమేణా తీరప్రాంతాన్ని కబలిస్తూ మరింత ముందుకు చొచ్చకువచ్చింది. దీంతో అంతర్వేది తీరప్రాంతంలోని పలు నిర్మణాలు, సరుగుడు తోటలు కొబ్బరితోటలు సముద్రగర్భంలో కలిసిపోయాయి.
తాజాగా సముద్రం 500 మీటర్లు మేర వెనక్కువెళ్లడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సునామీ సమయాల్లో కూడా ఇలానే సముద్రం వెనక్కు వెళ్లి మళ్లీ భారీ స్థాయిలో ముందుకు వస్తుందని, ఇది సునామీకు సంకేతమా అంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది.. అయితే అధికారులు దీనిని కొట్టి పడేస్తున్నారు. సముద్రం అమావాస్య, పౌర్ణమిలకు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని, ఇది సర్వ సాధారణమేనని స్థానికులు కొందరు తేల్చిచెబుతున్నారు..