- రామచంద్రపురం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆత్మహత్యాయత్నం..
- మంత్రి వేణు సమక్షంలోనే దాడి చేశారంటూ మనస్థాపం..
- ఏపీలో మరింత ముదురుతున్న వర్గ పోరు
- ఎన్నికల్లో టికెట్ కోసం సొంత పార్టీ నేతల కుమ్ములాటలు


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని రాజకీయ రగడ చినికి చినికి గాలివానలా మారుతోంది. రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వర్గాల మధ్య టిక్కెట్‌ రగడ గత కొన్ని రోజులుగా ఉంది. ఈ క్రమంలో ఆదివారం రామచంద్రపురంలో నిర్వహించిన బీసీల సమావేశంలో బోస్‌ వర్గీయులు అధిక సంఖ్యలో వేణుకు వ్యతిరేకంగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో బోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు రామచంద్రపురం వైసీపీ టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేసమయంలో మంత్రి వేణు తమను రాజకీయంగా అణగ దొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడం మరింత వివాదం రేగింది.


తాజాగా రామచంద్రపురం మచ్చుపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గన్న మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వర్గీయుడు అయిన కోలమూరు శివాజీపై కొందరు దాడిచేయడం, మంత్రి వేణు సమక్షంలోనే ఆయన అనుచరులే దాడిచేశారని ఆరోపిస్తూ శివాజీ అవమానభారంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కోలమూరు శివాజీ రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రామచంద్రపురంలో పరిస్థితి మంత్రి వేణు, ఎంపీ బోస్‌ వర్గీయుల మధ్య నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది.. 


బోస్‌ తనయునికి టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌..
రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఆదివారం ఎంపీ బోస్‌ వర్గీయుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ శివాజీ కూడా పాల్గన్నారు. సుభాష్‌చంద్రబోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు రామచంద్రపురం వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో సమావేశం నిర్వహించగా పార్టీకోసం, ముఖ్యమంత్రి జగన్‌ కోసం సమస్తం వదులుకుని వచ్చిన బోస్‌ను పార్టీ పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోందని, ఎక్కడి నుంచో వచ్చిన మంత్రి వేణుకు మరోసారి టిక్కెట్టు ఇస్తే సహించేది లేదని వారు తేల్చిచెప్పారు. అయినప్పటికీ బోస్‌ తనయునికి కాదని వేణుకు సీటు ఇస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపి నెగ్గించుకుంటామని కుండబద్దలు కొట్టారు. అంతే కాకుండా మంత్రి చెల్లుబోయిన వేణు బోస్‌ వర్గీయులుగా ఉన్న అందరినీ రాజకీయంగానే కాకుండా అన్ని విధాలుగా అణగదొక్కుతున్నారని, ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతుందంటున్నారు. మంత్రి తణయుడు చెల్లుబోయిన నరేన్‌ కూడా నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించారు.


నిలకడగానే వైస్‌ ఛైర్మన్‌ పరిస్థితి..
మంత్రి చెల్లుబోయిన వేణు సమక్షంలోనే ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని మనస్థాపం చెందిన రామచంద్రపురం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కోలమూరు శివాజీ  ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆయన్ను హుటాహుటీన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించడంతో ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial