Rajahmundry jail officials responds on chandrababu open letter:
రాజమండ్రి: తాను జైల్లో లేనని, ప్రజల గుండెల్లో ఉన్నానని.. తనను అన్యాయంగా జైలు గోడల మధ్య బంధించారని.. త్వరలోనే బయటకు వస్తానంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే. ఆదివారం సాయంత్రం టీడీపీ అధినేత రాసిన బహిరంగ లేఖ బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రాసిన లేఖపై అధికారులు స్పందించారు. చంద్రబాబు బహిరంగ లేఖను పోలీస్ అధికారులు షేర్ చేస్తూ.. అది జైలు నుంచి జారీ చేసింది కాదన్నారు. జైలు నియమావళి ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేసిన కరపత్రాలు బయటకు విడదల చేయాలంటే, ఆ పత్రంను ముందుగా జైలు అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
అలాంటి కరపత్రాన్ని జైలర్ పరిశీలించి ధ్రువీకరించి, సంతకం, జైలు ముద్రతో సంబంధిత కోర్టులకు, లేక ఇతర ప్రభుత్వ శాఖలకు, వారి కుటుంబ సభ్యులకు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు లేఖకు జైలుకు ఏ సంబంధం లేదని ఓ ప్రకటనలో రాజమండ్రి జైలు పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు.
Chandrababu open letter to people from Rajahmundry Central Jail
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘నేను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నాను. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వరలో బయటకొస్తాను. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటూ తన లేఖ ద్వారా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు బహిరంగ లేఖలో ఏముందంటే..
‘ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నించి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను.
ఈ దసరాకి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించగా.. అదే చోట జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఎప్పుడూ బయటకు రాని నందమూరి తారకరామారావు బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడనుంది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి 'నిజం గెలవాలి' అంటూ వస్తారని’ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.