నరసాపురం: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. బాధ్యత గల ఉద్యోగాలు, పదవుల్లో ఉన్న కొందరు ఆడపిల్ల కనిపిస్తే చాలు కన్నూమిన్నూ కానకుండా కామాంధులవుతున్నారు.. ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు మహిళలకు రక్షణపై ఆందోళన పెంచుతున్నాయి. కదులుతోన్న ట్రైన్‌లో ఓ ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీటీఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు ఆ టీటీఈ మీద కేసు నమోదు చేశారు. అంతకుముందే అతడ్ని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
నాతో చనువుగా ఉండు.. చల్లగా ఏసీలో ఉండు, నాకు సహకరిస్తే - నీకు సహాయం చేస్తా అని వెకిలి మాటలతో ఆ యువతితో పులిహోరా కలపాలని ప్రయత్నించాడు.. చివరకు మనసులో ఉన్న మాట బయటపెట్టేసి ట్రైన్‌లో రిజర్వేషన్ బెర్త్ కావాలంటే తనతో గడపాలని కోరాడు.. ఈ మాటలకు షాక్ అయిన ఆయువతి అక్కడ ప్రతిఘటించేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మిన్నకుండిపోయింది.. అయితే సదరు రైల్వే ఉద్యోగి ప్రవర్తన మితిమీరి ఆమెను తాకకూడని చోట తాకుతున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి పక్క కంపార్ట్ మెంట్‌లోకి వెళ్లి అక్కడున్నవారితో తన గోడు చెప్పుకుంది.
అసలేం జరిగిందంటే..
ఈనెల 8వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి నెల్లూరుకు ట్రైన్లో జిల్లాకు చెందిన ఓ యువతి(20) బయలు దేరింది.. ఈమె బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తోంది.. ట్రైన్ బయలుదేరిన కాసేపటికి టీటీఈ (TTE) అభిజిత్ (బిహార్‌కు చెందిన) రైల్వే ఉద్యోగి యువతి ప్రక్కన కూర్చుని మాటలు కలిపాడు. ఆతరువాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఎవరూ ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఆమె మిన్నకుండిపోయినట్లు రైల్వే అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు తెలిసింది.. సదరు రైల్వే టి టి.. ఆ యువతితో మాట్లాడుతూ.. ఏసీ కంపార్ట్మెంట్ కు మారుస్తానని చెప్పి చాలా కూల్‌గా ఉంటుందని, తనకు సహకరిస్తే నీకు బెర్త్ కన్ఫర్మ్ చేస్తానంటూ మరలా యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తనతో లైంగికంగా కలవాలని వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడంతో భయకంపితురాలైన ఆయువతి పరుగున ప్రయాణికులు ఉన్న మరొక కంపార్ట్మెంట్ లోకి వెళ్లి జరిగిన విషయం తోటి ప్రయాణికులు ఇద్దరితో చెప్పింది.
ప్రయాణికుల సహాయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు..
రైలులో ప్రయాణికురాలి పట్లా అసభ్యంగా ప్రవర్తించిన టీటీఈ వ్యవహార శైలిపై ప్రశ్నించేందుకు వెళ్లగా అక్కడ లేకుండా వేరే కంపార్ట్ మెంట్‌లోకి వెళ్లిపోయాడని, దీంతో ట్రైన్ విజయవాడ వెళ్లేసరికి తోటి ప్రయాణికుల సహాయంతో విజయవాడ రైల్వే పోలీసులకు జరిగిన విషయం చెప్పి కంప్లైంట్ ఇచ్చింది బాధిత యువతి. ఆ ట్రైన్‌లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగి అభిజిత్ కుమార్ గా గుర్తించిన రైల్వే పోలీసులు అతని పై 38/2025 - 74/75(2) BNS సెక్షన్లకు కింద కేసు నమోదు చేశారు. రైల్వే ఉన్నతాధికారులు అతడిని ఇదివరకే సస్పెండ్ చేశారని తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరల్...
నర్సాపురం నుంచి బయలు దేరిన ట్రైన్‌లో ఓయువతి పట్లా టీటీఈ అసభ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.. రైల్వే ఉద్యోగిగా ఉంటూ బాద్యతను మరచి ఆడపిల్లపై లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆడబిడ్డల జోలికి వచ్చినా.. లైంగిక వేధింపులకు గురిచేసినా.. అదే అతనికి ఆఖరి రోజు అని పేర్కొన్నారని మరి ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారో చూడాలని మరికొందరు కామెంట్లు పెడుతూ పోస్టులు పెట్టారు.