Andhra Pradesh Rains News Update | అమరావతి: ఏపీకి 'మొంథా' తుఫాను పొంచి ఉంది. ‘మొంథా’ తుపాన్ ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Continues below advertisement

కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా తుపాను

అక్టోబర్ 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుంది. చాలా చోట్ల 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Continues below advertisement

అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు

ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలన్నారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సూచించారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా లెక్కప్రకారం జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జిలు..

కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆయన ఆదేశించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండి సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు ఏ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని కాన్ఫరెన్స్ నిర్వహించిర సీఎం చంద్రబాబు ఆదేశించారు.