Raghurama Krishnam Raju MP: కేఏ పాల్‌కు ముఖ్యమంత్రి జగన్‌కు ఏం తేడా లేదని ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామక్రిష్ణ రాజు ఎద్దేవా చేశారు. కేఏ పాల్ కూడా తన ప్రజాశాంతి పార్టీకి 175కి 175 సీట్లు గెలుస్తామని చెబుతుంటారని గుర్తు చేశారు. అలాగే జగన్ కూడా వై నాట్ 175 అని అంటున్నారని రఘురామ అన్నారు. 


జూన్ 4న వైఎస్ఆర్ సీపీకి కర్మ నిర్వహిస్తామని ఆ కార్యక్రమానికి అందరూ రావాలని సెటైర్లు వేశారు. నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కుటుంబ సమేతంగా కోనసీమలో పలు దేవాలయాలు సందర్శించారు. ఈ సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 152 సీట్లు వస్తాయని అనడం కేఏ పాల్ 175 సీట్లు మా పార్టీకే వస్తాయని చెప్పడం ఒకటే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 125 సీట్లు పైన గెలుచుకుని ఆంధ్రుల రాజధాని అమరావతిలో జూన్ 9వ తారీఖున గాని పండితులు పెట్టిన ముహూర్తానికి గాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.


జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన నుంచి తిరిగి వస్తారో లేదో అని ఇప్పటికీ చాలామందికి అనుమానంగానే ఉందని అన్నారు. జూన్ 9వ తేదీన కేఏ పాల్, వైయస్ జగన్మోహన్ రెడ్డి మాక్ ప్రమాణస్వీకారం విశాఖపట్నంలో ఉన్న పిచ్చాసుపత్రిలో చేస్తారని ఎద్దేవా చేశారు. 


మాచర్ల ఘటనల గురించి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఈవీఎం బద్దలు కొడితే రిగ్గింగ్ ఆపడానికి వెళ్లారని సాక్షిలో రాయడం విడ్డూరం అని అన్నారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన వ్యక్తి పోలీసులకు దొరకకుండా పారిపోవాల్సిన కారణం ఏమిటని నిలదీశారు. జగన్ రెడ్డి పార్టీలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా వారికి మాత్రం కనిపించబోదని విమర్శించారు.