Pulasa Fish Arrives in Konaseema: గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాలు ఒక్కసారైనా ఈ చేప రుచి చూడాలని ఆశపడతారు. గోదావరికి ఎర్ర నీరు రావడంతో.. పులసల సీజన్ మొదలైంది. తొలి పులస జాలర్ల వలకు చిక్కింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్రనీరు వచ్చిందంటే.. పులసల సీజన్‌ వచ్చేసినట్టే.. వచ్చేసినట్టే కాదు.. వచ్చేసింది. అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. 


పుస్తెలు అమ్మి అయినా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. పది రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పని చెప్పారు. ఈ సీజన్‌లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్‌ అలాంటిది మరి. వలలో పులస పడిందంటే మత్స్కకారుల పంట పండినట్టే. అనుకున్నట్టుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. 


కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పనరామునిలంకకు చెందిన మాజీ సర్పంచ్‌ బర్రె శ్రీను రూ.24,000లకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులసకూరను బంధువులందరితో షేర్‌ చేసుకుంటున్నారు. అమోఘమైన రుచితో పాటు.. ఏడాదిలో చాలా తక్కువకాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండటానికి ఒక కారణం.