Surya Rao vs Amulya Politics | అన్నా చెళ్లెళ్ల మాటల యుద్థం, అన్నా దమ్ముళ్ల మధ్య మాటల తూటాలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ హాట్ టాపిక్ అవుతుంటాయి. సంచలనం.. ఎందుకంటే ఏపీలో అన్నా చెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలా రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా మారితే.. తెలంగాణాలో కేటీఆర్, కవిత ల మధ్య ఎటువంటి పొలిటికల్ వాతావరణం నెలకొందో చెప్పనక్కర్లేదు. ఇటువంటి పరిణామాలు కేవలం ముఖ్యమంత్రి స్థాయి కుటుంబాల్లోనే అనుకుంటే పొరపాటే... ఏపీలోని ఓ మాజీ మంత్రి ఇంట్లోనూ తండ్రి, కూతురు మధ్య ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణమే నెలకొంది.. దీనికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం వేదికగా మారింది.. మాజీ మంత్రి, వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్య కు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బాద్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అవుతోంది. పొలిటికల్ తెరమీద తండ్రి వర్సెస్ కూతురు కథ అందరి దృష్టిలో ఆసక్తిని నెలకొల్పింది..
వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా...
రాష్ట్ర విభజన, నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అల్లవరం ఎస్సీ కానిస్టెన్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.. ఆతరువాత కాంగ్రెస్ పార్టీకు రాజినామా చేసి మళ్లీ టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.. 2019లో టీడీపీ తరపున పోటీచేసి ఓటమి చెంది 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకుని రాజోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు.. ప్రస్తుతం ఆయన రాజోలు నియోజవకవర్గ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం గొల్లపల్లి సూర్యారావుకు షాక్ నిచ్చే ప్రకటన విడుదల చేసింది.. టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ బాద్యతలను గొల్లపల్లి కుమార్తె గొల్లపల్లి అమూల్యకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది..
రాజోలు టీడీపీ ఇంచార్జ్ స్థాయికి చేరిందిలా..!
2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన క్రమంలో గొల్లపల్లి సూర్యారావు కుటుంబం కూడా రాజోలు నియోజకవర్గంలో ఆయనకు సహకారంగా ప్రచారం చేసింది.. ఈక్రమంలోనే గొల్లపల్లి అమూల్య రాజోలు నియోజకవర్గంలో 2014 నుంచి 2024 వరకు రాజోలు టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకోవడమే కాదు.. ఏకంగా గత అయిదేళ్లుగా నియోజవర్గ పరిధిలోని జగ్గన్నపేటలో నివాసం ఉంటోంది.. ఈక్రమంలోనే 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున తాను బరిలో ఉన్నానంటూ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో కుటుంబంలో వివాదం మొదలయ్యింది. గొల్లపల్లి సూర్యారావు, ఆయన కుమారుడు శ్రీధర్‌లు అమూల్యను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు ప్రచారం జరిగింది.
ఒక దశలో రాజోలు టిక్కెట్టు అమూల్యకే ఇస్తున్నారంటూ ప్రచారం కూడా జరిగింది.. అయితే అనూహ్యంగా జనసేన తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాదరావు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో రాజోలు స్థానం జనసేన ఎగరేసుకుపోయింది.. ఈక్రమంలో అయోమయంలో పడిన గొల్లపల్లి సూర్యారావు వైసీపీ ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించి రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఆయన కుమార్తె గొల్లపల్లి అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ చురుగ్గా వ్యవహరించింది.. దీంతో పార్టీ అధిష్టానం దృష్టిలో గుర్తింపు పొంది ఇప్పడు నియోజకవర్గ ఇంచార్జ్ స్థాయిని అందుకున్నారు..
రాజోలులో రసవత్తరంగా రాజకీయం..
రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తుండగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. మధ్యలో వైసీపీకు పూర్తి ఆపోజిట్ పార్టీగా ఉన్న టీడీపీ నుంచి ఆయన కుమార్తె అమూల్య ఉండడం వైసీపీకు కొరకరాని కొయ్యలా మరిందంటున్నారు.. ఐవీఆర్ ఎస్ ద్వారా నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేపట్టిన టీడీపీ అధిష్టానంకు అమూల్య కు మద్దతు తెలుపుతూ 70 శాతంకు పైగా తమ అంగీకారం తెలిపారని తెలుస్తోంది.. పైగా పార్టీ బలోపేతంకు కృషిచేస్తూనే ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన ఎమ్మెల్యే వరప్రసాదరావుతో కలిసి పనిచేస్తానని అమూల్య ప్రకటించారు. దీంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రీకూతుర్ల మధ్య మాటల యుద్ధం ఏస్థాయిలో ఉంటుందో అంటూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది..