Konaseema News: పండుగ వచ్చిందంటే చాలు.. సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్లెక్సీలపై ఒకొక్కడూ ఒక్కో ట్యాగ్ లైన్లతో రెచ్చిపోతున్నారు. అభిమాన హీరోలను, అభిమాన నాయకులను ఫ్లెక్సీల్లో వేయించుకునేంత వరకు బాగానే ఉన్నా అందులో రాస్తోన్న పిచ్చి రాతలే కల్లోలాన్ని రేపుతున్నాయి.. దీంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ విష సంస్కృతి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరీ హద్దుమీరుతుండగా గతంలో చోటుచేసుకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.. హీరోల పేరుతో జిల్లా పేరుకు అంటగడితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు...
పండుగ వచ్చిందంటే చాలు ఇదే తీరు..
పండుగ వచ్చిందంటే చాలు గ్రామాల నుంచి పట్టణాల వరకు ఫ్లెక్సీలు పోటాపోటీగా ఏర్పాటుచేసి వివాదాలకు తెరలేపుతున్నారు.. ఇక సినిమా హీరోల పుట్టినరోజులకు ఇక షరా మామూలే.. అంతే కాదు వారి పుట్టిన రోజులకు పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో వేటికీ అనుమతులుండవు. ఊరి ఎంట్రన్స్‌లలోనూ, కూడళ్లలోనూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై పిచ్చి రాతలతో గొడవలను రేపుతున్నారు.
ఇటీవలే వినాయకచవితిని పురస్కరించుకుని పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండల పరిధిలోకి వచ్చే పెదపట్లంకలో ఫ్లెక్సీలో రాయించిన పిచ్చిరాతలు రెండు సామాజిక వర్గాల మధ్య వివాదానికి తెరలేపింది. ఈ ఫ్లెక్సీ తమ సామాజికవర్గాన్ని ఉద్దేశించి పెట్టిందే అంటూ అభ్యంతరం తెలపడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.. ఇక ఈ ఫ్లెక్సీల్లో సినిమా డైలాగులు పెడుతూ రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల కూడా మరిన్ని గొడవలకు కారణంగా నిలుస్తుందని పలువురు అభ్యంతరం చెబుతున్నారు..
కులసీమగా మారుస్తోన్న ఆకతాయిలు..
కులాల వారిగా ఫ్లెక్సీలు పెడుతూ వివాదాలకు కారణంగా నిలుస్తోన్నవారిలో అంతా 25 ఏళ్లలోపు యువకులేనని, అందులో కూడా ఆకతాయిలు ఎక్కువగా ఉంటున్నారంటున్నారు.. ఇటీవల కాలంలో కోనసీమను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కళ్యాణ్ సీమ అని, మహేష్‌బాబు ఫ్యాన్స్ పేరుతో బాబు సీమ అంటూ ఫ్లెక్సీలపై రాతలు రాయించి మరికొంత వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నారు. మరికొందరు అయితే ఇంకాస్త ముందుకెళ్లి కులాలపేరుతో సీమ అంటూ పిచ్చి రాతలు రాయించడం కనిపించింది..
పోలీసులు మాస్ వార్నింగ్..
దసరా పండుగ అనగానే కోనసీమ ప్రాంతంలో చెడీ తాలింఖానా వంటి ప్రదర్శనలు జరుగుతుంటాయి.. ఈ ఉత్సవాల్లో వివాదాలు, కొట్లాటకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు ఫ్లెక్సీల వ్యవహారంపై కూడా అంతే దృష్టిసారించాయి. దీనికి తోడు పలు సినిమాలు కూడా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వ స్థలాల్లో ఫ్లెక్సీలు ఇష్టానుసారంగా కడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాకుండా ఫ్లెక్సీల ప్రింటింగ్ యజమానులకు కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరైనా అనుచిత వ్యాఖ్యలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ చేస్తే ముందు వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్సీ రాహుల్‌మీనా నేతృత్వంలో ఇప్పటికే కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం, మండపేట డివిజన్ డీఎస్పీలు పలు సమావేశాలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీ ఫ్రింటింగ్ యూనిట్ల యజమానులకు, పలు ఉత్సవ కమిటీలను హెచ్చరించారు.