Dowleswaram irrigation office | ధవళేశ్వరం: ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరిగి, కీలక డాక్యుమెంట్స్ దగ్దం కావడం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం సంబంధించిన కొన్ని పత్రాలు కాలిపోయాయి. అవి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలు దగ్ధం అంటూ ప్రచారం జరిగింది. 


డిప్యూటీ కలెక్టర్  వేదవల్లి ఇరిగేషన్ ఆఫీసుకు వెళ్లి కాలి బూడిదైన దస్త్రాలు పరిశీలించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ధవళేశ్వరం ఇరిగేషన్ r&r ఆఫీసు బయట కొన్ని డాక్యుమెంట్స్ దగ్దమయ్యాయని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. Nmc వన్ పేపర్స్ తగల బెట్టారని చెబుతున్నారు. లెఫ్ట్ కెనాల్ అధికారుల ఆఫీసులో కింద పేపర్స్ ఉంటే స్వీపర్ బయట పడేయగా.. చెత్త పేపర్లు అని కాల్చివేశారని చెప్పారు. పేపర్స్ పై సంతకాలు ఏమీ లేవు అని, అయితే సగం కాలిన పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో కొన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి. పేపర్లపై ఎలాంటి సంతకాలు లేవు కనుక అంత ఇంపార్టెంట్ కాదన్నారు. అయితే ఏ పేపర్స్ దగ్ధం చేయాలన్నా తన అనుమతి తీసుకొవాలని... అలా ఎందుకు జరగలేదు, పేపర్లు ఎవరు కాల్చారో విచారణ చేపడతాం అన్నారు.


రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కామెంట్స్...
ఈ ఘటనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి స్పందించారరు. ఆయన మాట్లాడుతూ.. ‘ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో కొత్త బీరువాలు వచ్చాయని,  ఫైల్స్ అన్ని బీరువాలో సర్దిపెట్టారు. బీరువాలో వేస్ట్ పేపరు తీసి, దగ్ధం చేసామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టింది. ధవళేశ్వరంలో సగం కాలిపోయిన కాగితాలపై అధికారులు సంతకాలు లేవు, కనుక అవి అంత ముఖ్యమైన పేపర్లుగా అనిపించలేదు. పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని’ బుచ్చయ్య చౌదరి అన్నారు.


ఏపీలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ ఘటనపై ఇరిగేషన్ సూపరింటెండ్ కుమారి బాధ్యత వహించాలన్నారు. కాగా, అక్కడ పేపర్లు దగ్దం చేసిన యువతి విశాఖకు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే సరిగ్గా ఇప్పుడే అంత అత్యవసరంగా సెలవు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. సగం కాలిన పేపర్లన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.


వైసీపీ పనేనని రామానాయుడు ఆరోపణలు


ఆ పత్రాలను వైసీపీ నేతలే తగలబెట్టి ఉంటారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కప్పి పుచ్చేందుకు ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 


ఆధారాలు ఉంటే కేసు పెట్టాలన్న అంబటి రాంబాబు


ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో పత్రాలు కాలిపోవడాన్ని సైతం టీడీపీ రాజకీయం చేస్తుందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఈ పని చేశారని నిరూపించేందుకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పని అని దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు పోలవరంపై తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.