Pithapuram News: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం ఎప్ప‌డూ వార్త‌ల్లో నిలుస్తుంది.. ఇక్క‌డ స్థానిక ప్ర‌జ‌ల్లో మంచి ప‌ట్టున్న టీడీపీ నాయ‌కునిగా గుర్తింపు పొందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ వైసీపీలోకి వెళ్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతోంది.. ఇందులో భాగంగానే కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డిని క‌లిశార‌ని, త్వ‌ర‌లోనే మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కూడా కల‌వ‌బోతున్నారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఇంత‌కీ.. నిజంగా వ‌ర్మ వైసీపీలోకి వెళ్తున్నారా.. ? 

 

పిఠాపురంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఎన్వీఎస్ వ‌ర్మ‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది.. ఆయ‌న కంటూ నియోజ‌క‌వ‌ర్గంలో వీరాభిమానులు ఉన్నారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే వ‌ర్మ గురించి అడిగితే ఆయ‌న్ను దేవుడు అంటారు.. అంత‌లా పిఠాపురంలో అభిమానాన్ని సొంతం చేసుకున్న వ‌ర్మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి ఆయ‌న కంటే కూడా ఆయ‌న్ను న‌మ్ముకున్న అనుచ‌రులు, అభిమానుల్లోనే ఎక్కువ ఒక ర‌క‌మైన అసంతృప్తి క‌నిపిస్తుంటుంది.. ఇంకా చెప్పాలంటే కూడా అస‌హ‌నం కూడా వ్య‌క్తం అవుతుంటుంది.. దీనికి ప్ర‌ధాన‌కార‌ణం.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోయుంటే ఆయ‌నే ఎమ్మెల్యే.. ఆయితే ప‌వ‌న్ కోసం త‌న సీటును త్యాగంచేశార‌ని  చెబుతారు. టీడీపీ అధిష్టానం మాట‌నే శిరోధార్యంగా భావించిన వ‌ర్మ‌కు ఇచ్చిన హామీ ప్ర‌కారం ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన పార్టీ ఆధిప‌త్యం.. టీడీపీ క్యాడ‌ర్‌ నిస్తేజంతో ఒక రక‌మైన అసంతృప్తి మాత్రం నివురుగ‌ప్పిన నిప్పులా మాత్రం క‌నిపిస్తోంది..

ప్ర‌తిన బూనిన ముద్ర‌గ‌డ‌ను వ‌ర్మ ఎందుకు క‌లిశారు..?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‌ను పిఠాపురంలో గెల‌వ‌నివ్వ‌ను అని ఎన్నిక‌ల‌కు ముందు కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డిని ప్ర‌తిన‌బూనారు. అయితే ఆయ‌న వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత త‌రపున పిఠాపురంలో ప్ర‌చారం చేశారు.. కానీ అనూహ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుగులేని మెజార్టీతో అఖండ విజ‌యం సాధించారు. ఆయ‌న గెలుపుకు మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ పాత్ర కూడా కీల‌కంగా నిలిచింది.. అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఇటీవ‌ల కాలంలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య వ‌ర్గ‌పోరు తారా స్థాయికి చేరింది.. ఏ కార్య‌క్ర‌మాల్లోనూ త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. కొంత మందికి ప‌దవులు ఉన్నా కేవ‌లం ఉత్స‌వ విగ్ర‌హాల్లా మాత్రం ఉంటున్నామ‌ని, ఏ కార్య‌క్ర‌మాల్లో కూడా ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని తీవ్ర అస‌హ‌నంలో ఉంటున్నారు.. కేవ‌లం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ‌కు మాత్ర‌మే స‌మాచారం ఇచ్చి మిగిలిన టీడీపీ నాయ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్ట‌డం వారు విసుగు చెంది పార్టీకు దూరం కావాల‌నే ఎత్తుగ‌డ ఇద‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపించిన సంద‌ర్భాలు క‌నిపించాయి.. అయితే ఈ ప‌రిణామాల మ‌ధ్య మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ‌ను క‌లిశార‌న్న వార్త‌ హాట్ హాట్‌గా మారింది.  

 

సోష‌ల్ మీడియా ప్ర‌చారంపై నోరు విప్ప‌ని వ‌ర్మ‌..

వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డిని వ‌ర్మ ఇటీవ‌లే క‌లిశారు.. కిర్లంపూడిలోని ఆయ‌న గృహానికి వెళ్లి క‌లిసిన మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఇటీవ‌లే ముద్ర‌గ‌డ తీవ్ర అనారోగ్యానికి గురికాగా సాధార‌ణ ప‌రామ‌ర్శ‌లో భాగంగా ఆయ‌న్ను క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.. అంత‌కు మించి అక్క‌డ ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం వ‌ర్మ వైసీసీలోకి వెళ్తున్నారంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. దీనికి వైసీపీ సోష‌ల్ మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.. అయితే ఈ ప్ర‌చారంపై మాత్రం ఇటు వ‌ర్మ కానీ, అటు ముద్ర‌గ‌డ కానీ ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

అటువంటి నిర్ణ‌యం తీసుకోరంటున్న టీడీపీ క్యాడ‌ర్‌..

టీడీపీ అంటే అమిత‌మైన అభిమానం క‌లిగిన వ‌ర్మ‌కు అధినేత చంద్ర‌బాబు, యువ నేత లోకేష్‌తో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, వ‌ర్మ‌కు పిఠాపురంలో తిరుగులేని క్యాడ‌ర్‌, ఓటుబ్యాంకు ఉండ‌గా ఆయ‌న వేరే పార్టీ వైపు చూడాల్సిన అవ‌స‌రం ఏంట‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ క్యాడ‌ర్ మండిప‌డింది. కాపు ఉద్య‌మ‌నేత‌, మాజీ మంత్రిగా ప‌నిచేసిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డి అనారోగ్యానికి గురికావ‌డంతో ఆయ‌న్ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళితే ఇలా లేనిపోనివి అంట‌గ‌డుతున్నారంటున్నారు.