Pithapuram Latest News: ఇళ్ల‌ల్లోనూ, షాపుల్లోనూ దొంగ‌త‌నాలు చేయ‌డం పాత ప‌ద్ద‌తి.. ఇప్ప‌డు ఆగి ఉన్న లారీల‌ను హైజాక్ చేయడం.. దాంట్లో ఉన్న ల‌క్ష‌లాది రూపాయ‌ల స‌రకు లూటీచేసి ఆపై లారీ వ‌దిలేయ‌డం కాకినాడలో కొత్త ట్రెండు. గ‌తంలో సిగ‌రెట్ల లోడుతో వెళ్తున్న కంటైన‌ర్ల‌ను, సెల్‌ఫోన్‌ల లోడుతో వెళ్తున్న ట్ర‌క్కుల‌ను దారి మ‌ళ్లించి ఆపై అందులో ఉన్న స‌రకు లూటీ చేసిన ఘ‌ట‌న‌లు చూశాం. కాకినాడ జిల్లాలో పార్కింగ్ చేసిన లారీను ఎత్తుకెళ్లి.. ఆపై అందులో ఉన్న రూ.20ల‌క్ష‌ల విలువ చేసే ఆయిల్ ప్యాకెట్ల‌ు లూటీ చేశారు దొంగ‌లు..

అస‌లు ఏం జ‌రిగిందంటే..

కాకినాడలోని డైరీఫామ్ సెంటర్‌కు చెందిన ఓనర్ కమ్ డ్రైవర్ దగ్గు అప్పారావు నగర శివారులోని జెమిని కంపెనీ వద్ద సన్‌ప్లవర్‌ ఆయిల్ ప్యాకెట్లును తన లారీలో ఈనెల 6 రాత్రి లోడు చేసుకున్నాడు. లోడు లారీతో రాత్రి 8.30గంటల సమయంలో పిఠాపురం తీసుకువచ్చి వెలంపేటకు చెందిన డ్రైవర్ నాళం రమణకు అప్పగించాడు. లోడు ఒడిస్సాలోని భువనేశ్వర్ తీసుకువెళ్లాల్సి ఉంది. ఇదే విష‌యాన్ని డ్రైవ‌ర్‌కు చెప్ప‌డంతో తెల్లవారు జామును బయల్దేరుదామని షిఠాపురంలోని కుంతీమాధవస్వామి ఆలయం సమీపంలో లారీని పార్కు చేశాడు. భువ‌నేశ్వ‌ర్‌కు బ‌య‌లుదేరేందుకు సిద్ధమై 7వ తేదీ ఉదయం 5.30గంటలకు డ్రైవ‌ర్‌ రమణ వచ్చి చూసుకునే సరికి లారీ మాయమైంది.
 
లారీ కనిపించకపోవడంతో అవాక్క‌ైన డ్రైవ‌ర్ రమణ య‌జ‌మాని అప్పారావుకు ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చాడు. పార్కింగ్ చేసిన లారీ క‌నిపించ‌డం లేద‌ని చెప్ప‌డంతో అప్పారావు అక్క‌డ‌కు చేరుకుని ఆ చుట్టుప‌క్క‌ల ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ గాలించారు.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఎవ‌రో గుర్తు తెలియని అగంత‌కులు లారీను ఎత్తుకుపోయుంటార‌ని భావించి య‌జ‌మాని అప్పారావు పిఠాపురం పోలీసుల‌కు పిర్యాదు చేశాడు..

గుర్తుతెలియ‌ని అగంత‌కులు ఎత్తుకెళ్లిన‌ట్లు నిర్ధార‌ణ‌..

పార్కింగ్ చేసిన లారీ మాయ‌మ‌వ్వ‌డంతో య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు రంగప్ర‌వేశం చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమేరాలు, గొల్లప్రోలు టోల్ గేటు వద్ద సీసీ కెమెరా పుటేజీల‌ను ప‌రిశీలించిన క్ర‌మంలో అర్థరాత్రి దాటిన తర్వాత 1.27గంటలకు లారీ టోల్ గేట్ దాటినట్లు గుర్తించారు. టోల్‌గెట్ వ‌ద్ద‌ ఫాస్టాగ్ ద్వారా కాకుండా టోల్ఫీజును నగదు రూపంలో చెల్లించారు. దీనితో సమీపంలోని అన్ని పోలీసుస్టేషన్లుకు సమాచారం అందించారు.
 
ఉదయం 11 గంటల సమయంలో లారీని తుని సమీపంలో 16వ జాతీయరహదారిపై గల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వదిలి వెళ్లినట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లి చూడగా అందులో సరకు పూర్తిగా మాయమైంది. ఖాళీ లారీ మాత్రమే క‌నిపించింది. అందులోని సరకును గొల్లప్రోలు-తుని మద్య ఎక్కడో చోరీకి పాల్పడిన ఆగంతకులు స‌రకును వేరే వాహ‌నంలోకి డంప్ చేసి లారీని వదిలివేసి పరారైనట్లు పోలీసులు బావిస్తున్నారు.

సంచ‌ల‌నంగా మారిన ఘ‌ట‌న‌..

రూ.20ల‌క్ష‌ల స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ ప్యాకెట్ల లోడుతో పార్కింగ్ చేసిన లారీను గుర్తు తెలియని అగంత‌కులు ఎత్తుకెళ్ల‌డంతో పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో సంచ‌ల‌నం రేకెత్తింది. లారీనే ఎత్తుకుపోయారు అంటూ ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది.. ఇదిలా ఉంటే ఆయిల్ ప్యాకెట్ల‌ లోడుతో ఉన్న లారీని అస‌లు ఆగంతకులు ఎలా గుర్తించారు. ఇది తెలిసిన వారి పనేనా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఫ్యాక్టరీ వ‌ద్ద లారీలోకి ఎగుమ‌తి అవుతున్న స‌మ‌యం నుంచి  ఫాలో అవుతూ వచ్చిన వారే ఈ దోపిడీకు పాల్పడ్డారా అని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే లారీని ఆగంతకులు తీసుకువెళ్లుతున్న సమయంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై టోలే గేట్ దాటే వరకూ వెన్నంటి ఉండటం పోలీసుల విచారణలో తేలింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు..