Pawan Kalyan on Pithapuram Maharaja Niece Video: పిఠాపురం మహారాజా మేనకోడలు కుటుంబ అభ్యర్థనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అయిదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మా ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించిన ఒక వీడియో సోషల్ మీడియా ప్రచారం కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి విచారణ చేయాలని కాకినాడ కలెక్టర్, ఆర్డీవోను ఆదేశించారు. మా ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేస్తామని బెదిరించడమే కాకుండా మమ్మల్ని కొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లి పోయారని పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండగా పోలీసుల్ని వెంటేసుకుని వచ్చి మరీ బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోగా తిరిగి తమను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ గారూ.. మీరే ఆదుకోవాలని లేదంటే మాకు చావు తప్ప మరో దారి లేదని అభ్యర్థిస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురు వీధిలో మహారాజా కోడలు విన్నపాల చంద్రలేఖ(78), తన ఇద్దరు కుమారులు రంగారావు, మాధవరావుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు 1970 నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా ఈ ఇంటిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా వీరు డిక్రీ పొందారు. అయితే రెండు నెలల క్రితం జిగటాల లక్ష్మి అనే మహిళ మరికొందరితో కలిసి వచ్చి ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామని వెంటనే ఖాళీ చేయాలని బెదిరించినట్లు చెప్పారు. ఆమె టీడీపీలో యాక్టివ్‌గా తిరుగుతుందని వివరించారు. తన కొడుకులు విజయనగరం, కాకినాడలో ఉద్యోగాలు చేసుకుంటున్నారని, గొడవల కారణంగా అస్తమానం ఇక్కడికి రావడానికి వారికి వీలుపడదని చెప్పారు. ఇంతకీ ఇంటిని మీకు ఎవరు అమ్మారని అడిగితే చెప్పకుండా దౌర్జన్యం చేసి మెడలో బంగారు గొలుసును లాక్కుని పోయారని ఇంటికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని సామాన్లు చిందరవందరగా చేసి బయటపడేశారని తెలిపారు.
అయిదు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇంటిని, వారసత్వంగా తమకు సంక్రమించిన ఆస్తిని బెదిరించి లాక్కోవాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. ఇంటిని ఖాళీ చేసి వెళ్లకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ విన్నపాల చంద్రలేఖ, ఆమె కుమారుడు మాధవరావు వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విజ్ఞప్తి చేశారు. తమను ఆదుకోకపోతే చావే శరణ్యమని వాపోయారు.
విచారణ చేపట్టిన ఆర్డీవో కిశోర్..
బాధితురాలు చంద్రలేఖ మాట్లాడిన వీడియోను వైసీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్ (Jagananna Connects) ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వెంటనే విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఆర్డీవో కిశోర్ చంద్రలేఖ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో విచారణ చేసేందుకు వచ్చామని ఆమెకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ ఆస్తి చంద్రలేఖ కుటుంబానికే చెందుతుందని చెప్పిన ఆర్డీవో తుది తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే ఆస్తి వారికి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి శాఖా పరంగా మాత్రమే విచారణ చేస్తున్నామని చెప్పారు.