అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకర్గంలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ రాకతో జన ప్రవాహం ఉప్పెనలా మారడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎండ తీవ్రత కూడా అత్యంత ఎక్కువగా ఉండటంతో అభిమానులు పోలీసులు తీవ్ర అలసటకు గురైన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి అత్యంత సమీపంలో విధులు నిర్వహిస్తున్న పి. గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ చెమటలు కక్కుతూ కొంత అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ సీఐ ప్రశాంత్ కుమార్ కు ఎనర్జీ డ్రింకును అందించారు. అది తీసుకున్న సీఐ వెంటనే ఆ డ్రింక్ సేవించి కొంత ఉపశమనం పొందారు.
పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారికి డ్రింక్ అందిస్తున్న ఫోటో, వెంటనే ఆ డ్రింకును సదరు పోలీసు అధికారి సేవిస్తున్న ఫోటో లు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ మానవీయతను సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ చేస్తున్నారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ మొదట అకాల వర్షానికి కడియపు లంకలో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జనసేన అధినేతకు తమ ఇబ్బందులను తెలిపారు. కల్లాలలోనే ధాన్యం మొలకెత్తి తీవ్రంగా నష్టపోయామని, ఈ మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని వాపోయారు. ఆ తరువాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా రావులపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి కొత్తపేట మండలంలోని అవిడి ప్రాంతంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలతోపాటు మొలకెత్తిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి మళ్లీ పి.గన్నవరం చేరుకుని అక్కడ రాజుపాలెం ప్రాంతంలో రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు తదితరులు ఉన్నారు.
అడుగడుగునా జన ప్రవాహం
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి, ఆపై రైతుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పర్యటించిన పవన్ కళ్యాణ్‌కు అడుగడుగునా జనసైనికుల నుంచి ఘన స్వాగతం లభించింది. మొదట రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్ట్ వద్దకు భారీ స్థాయిలో చేరుకున్న జనసైనికులు అక్కడి నుంచి ఆయన కాన్వాయ్ వెంట ర్యాలీగా తరలి వచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు భారీ గజమాలలు పలు చోట్ల ఏర్పాట్లు చేశారు. పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన గజమాల వేయడానికి అనుమతి తీసుకోవాలని అక్కడి ఎస్సై ఆంక్షలు పెట్టడంతో పోలీసులకు, జన సైనికులకు మధ్య కొంత వాగ్వాదం ఏర్పడింది. అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఎస్సై తో మాట్లాడి తమ నాయకునికి మాల వేసుకునేందుకు కూడా అనుమతి కావాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు.