East Godavari News: అతడి వద్ద సెల్ ఫోన్ లేదు. కొనుక్కునేందుకు డబ్బులు కూడా లేవు. ఈ క్రమంలోనే స్నేహితుడిని సాయం చేయమన్నాడు. క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ ఇప్పిస్తే నెలనెలా ఈఎంఐలు కడతానని చెప్పాడు. అందుకు ఒప్పుకొని ఫోన్ ఇప్పించాడు స్నేహితుడు. అదే అతని పాలిట శాపంగా మారింది. నెలా నెలా కడతానని చెప్పిన ఈఎంఐను కేవలం రెండు నెలలే సక్రమంగా కట్టాడు. ఆ తర్వాత నుంచి మానేశాడు. ఇదేంటని ఇంటికి వెళ్లి నిలదీసినందుకు ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపేశాడు. ఆపై అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టి తనకేం తెలియదని వివరించాడు. 


అసలేం జరిగిందంటే..? 
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లికోట గ్రామానికి చెందిన మృతుడు కొడమంచిలి సురేంద్రకు స్నేహితుడు లాకవరపు పవన్ కుమార్. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే పవన్ కుమార్ ఫోన్ పాడవడంతో.. కొత్త ఫోను కొనుక్కోవాలనుకున్నాడు. కానీ అతడి వద్ద డబ్బులు లేవు. స్నేహితుడు సురేంద్ర వద్ద క్రెడిక్  కార్డు ఉందని తెల్సిన అతను.. ప్రతీ నెల ఈఎంఐ కట్టుకుంటాను ఫోన్ ఇప్పించమని కోరాడు. ఇందుకు ఒప్పుకున్న అతడు ఫోన్ ఇప్పించాడు. అయితే రెండు నెలల పాటు పవన్ కుమార్ ఈఎంఐ సరిగ్గానే కట్టాడు. కానీ మూడో నెల నుంచి కట్టడం మానేశాడు. ఇదే విషయం గురించి అడిగేందుకు సురేంద్ర ఇటీవల పవన్ కుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన పవన్ కుమార్.. సురేంద్రపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 


విషయం గుర్తించిన అతడు మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా కవర్ చేశాడు. కానీ మూడ్రోజుల తర్వాత నుంచి పవన్ కుమార్ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పవన్ కుమార్ ను గట్టిగా నిలదీయగా.. స్నేహితుడిని చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో తహసీల్దార్ సమక్షంలో తవ్వకాలు జరిపిన మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. వేగంగా కేసు దర్యాప్తు చేసిన ఎస్ఐ సూర్య భగవాన్ ను, సిబ్బందిని అభినందించారు. 


ఏడు నెలల క్రితం తెలంగాణలో ఇలాంటి ఘటనే.. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం గాజులరాజం బస్తీకి చెందిన సందీప్‌ అలియాస్‌ బాబీ(23), అదే ప్రాంతానికి చెందిన జగడం సాయిలు చిన్ననాటి నుంచి మిత్రులు. అయితే ప్రతిరోజూ లాగే ఓరోజు వీరిద్దరూ కలిసి బస్తీలోని ఆర్కే సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గల్లీలో సిగరేట్ తాగారు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. అయితే విచక్షణా జ్ఞానం కోల్పోయిన సాయి.. బాబీపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పిడి గుద్దులు గుద్దాడు. విషయం గుర్తించిన స్థానికులు అక్కడకు వచ్చి వారిని ఆపి వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీళ్లు మాత్రం ఆగలేదు. జనాలు ఎక్కువయ్యే సరికి వారిద్దరూ కొట్టుకోవడం ఆపారు. అయితే అప్పటికే బాబీకి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.