TDP Candidates In East Godavari : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి (Anaparthy)నియోజకవర్గంలో టీడీపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy)టికెట్ దక్కించుకున్నారు. అటు పి గన్నవరం టికెట్ మహాసేన రాజేష్ (Mahasena Rajesh)కు బరిలోకి దించింది.
అనపర్తిలో నువ్వా నేనా ?
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గమే డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్స్. అందుకే ఇటు వైసిపి అటు టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి... గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతిలో... వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సూర్య నారాయణరెడ్డి ఓటమి పాలయ్యారు. మరోసారి చిరకాల ప్రత్యర్ధులే పోటీకి దిగుతున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇరువురి మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది.
టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉన్న రంగంపేట మండలంలో ఇటీవల పార్టీ శ్రేణులు రాజీనామా చేసి వైసీపీలో కలిసిపోవడం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మైనస్ గా మారింది. అయితే పెదపూడి మండలంలో టిడిపి పుంజుకుంది. తరచూ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై అవినీతి అక్రమాలు పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకట్టుకోవడానికి రామకృష్ణారెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వారు వన్ సైడే ఉంటుందని ఇరువురి నేతలు ధీమాలో ఉన్నారు. నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరగనున్న అనపర్తి నియోజకవర్గంలో వార్ ఏ సైడ్ అవుతుందనేది వేచి చూడాల్సి ఉంది.
మహాసేన రాజేష్ కు పి గన్నవరం టికెట్
పి. గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో టిడిపి వైసిపి నుంచి కొత్త మొఖాలే పోటీకి దిగుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. విపర్తి వేణుగోపాల్, టిడిపి అభ్యర్థిగా మహాసేన రాజేష్ పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ నుంచి భంగపడిన విపర్తి వేణుగోపాల్ ఈసారి తొలి జాబితాలోనే వైసీపీ టికెట్ సాధించారు. ఇరిగేషన్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్‌గాపనిచేసి రిటైర్డ్ అయినా విపర్తి వేణుగోపాల్... జిల్లా ప్రజలకు సుపరిచితులే. జడ్పీ చైర్మన్‌గా పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి పలు ప్రజా సమస్యలను పరిష్కరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మద్దతు విపర్తి వేణుగోపాల్ కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ధీమగా ఉన్నారు.
రాజేష్ ఎన్నికల్లకు కొత్త!
టిడిపి అభ్యర్థి మహాసేన రాజేష్ ఎన్నికలకు కొత్త వ్యక్తి. సామాజిక వర్గ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే రాజేష్ కు నియోజకవర్గంలో అంతగా పట్టులేదు. ఇక్కడ స్థానిక నేతలను పక్కన పెట్టి స్థానికేతరుడైన రాజేశ్‌కు టికెట్ ప్రకటించడంపై టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి రగిలిస్తోంది. రాజేష్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక టిడిపి నేతలు రాజేష్ కు ఎంతవరకు సహకరిస్తారు, దాని వల్ల ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్నట్లుగా ఉంది. టిడిపి అధిష్టానం ఆదేశాలకు తలొగ్గి పార్టీ శ్రేణులు పనిచేస్తారా అనేది అనుమానమే. టీడీపీ, జనసేన పార్టీలకు నియోజకవర్గంలో మంచి పట్టుంది.