National level women Beach Volleyball competitions | సువిశాల సాగరతీరం.. తెల్లని ఇసుకతో నిండిన బీచ్‌.. ఆహ్లాదపరిచే ఇసుక తిన్నెలు.. సుదూర తీరంలో అదో నీటి కొలనులా కనువిందుచేసే బ్యాక్‌ వాటర్‌.. మరింత దూరంలో సరుగుడు చెట్లు సోయగం.. ఇలా  ప్రకృతి రమణీయతను కళ్లకు ఇంపుగా కనిపించే సూర్సానయానాం సముద్రతీరప్రాంతంలో జాతీయస్థాయిలో ఇప్పుడు బీచ్‌ విమెన్‌ వాలీబాల్‌ పోటీలు జరగనున్నాయి.. ఈ పోటీలు కోసం ఇప్పటికే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.


అమలాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆడిటోరియం, ఓపెన్‌ రెస్టారెంట్‌ నిర్మాణాలు కూడా ఫ్రభుత్వం చేపట్టింది.. ఇప్పటికే ఎస్‌.యానాం నుంచి నేరుగా బీచ్‌కు చేరుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చొరవతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తికాగా పర్యాటకులు సముద్రతీరంలో సరదాగా గడిపేందుకు అనువుగా ఈ సాగర తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు.. 


ఈ 27, 28, 29 తేదీల్లో బీచ్‌ వాలీబాల్‌ పోటీలు..


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాం గ్రామం తీరప్రాంతంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో విమెన్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం కె.ఆర్డీవో మాధవి తెలిపారు. దీనికి సంబంధించి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ పోటీల్లో ఎనిమిది రాష్ట్రాలనుంచి మహిళా క్రీడాకారులు పాల్గంటారని తెలిపారు. బీచ్‌లో ఓపెన్‌ రెస్టారెంట్‌, ఆడిటోరియం నిర్మించి ఇకపై ప్రతీ ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. రాబోయే రోజుల్లో బీచ్‌ రిసార్ట్స్‌ ఇతర సదుపాయాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. 


వైట్‌సాండ్‌తో నిండి ఉండే బీచ్‌..


ఎస్‌.యానాం తీరప్రాంతం అంతా కూడా వైట్‌సాండ్‌తో నిండి ఉండడంతో ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడకు వచ్చేందుకు రోడ్డు మార్గం కూడా చాలా బాగా నిర్మించడంతో మరింతమంది ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో వైట్‌సాండ్‌తో నిండి ఉండే ప్రాంతం మరెక్కడా లేకపోగా సూర్సానయానంలో మాత్రం ఉండడం విశేషం.


ఎస్‌.యానాం బీచ్‌కు ఇలా చేరుకోవచ్చు... 


అమలాపురం నుంచి ఎస్‌.యానాం చేరుకునేందుకు 32 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అమాలాపురం బస్‌ కాంప్లెక్స్‌ నుంచి నేరుగా ఎస్‌.యానాం కు ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ప్రయివేటు లేదా సొంత వాహనాల్లో వెళ్లేవారు అమలాపురం నుంచి ఎర్రవంతెనకు చేరుకుని అక్కడి నుంచి చల్లపల్లి రోడ్డుమీదుగా ప్రయాణం చేస్తే చల్లపల్లి దాటగానే ఎస్‌.యానాం వస్తుంది. అక్కడి నుంచి కేవలం 5 కిలోమీటర్లు దూరంలో ఆహ్లాదకరమైన బీచ్‌ మనకు కనిపిస్తుంది.


Also Read: Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్