Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)ను పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారయినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. స్కిల్ డెవెలప్ మెంట్ కేసు (Skill Development Case)లో తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) అరెస్టుతో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. తిరిగి అక్కడి నుంచే 24వ తేదీ పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. 


విశాఖలో ముగింపు
అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. అయితే పాదయాత్రలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇచ్చాపురం బదులు విశాఖలోనే పాదయాత్ర ముగించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో చంద్రబాబు తన ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ను విశాఖలోనే ముగించారు. ఇదే సెంట్‌మెంట్‌తో లోకేశ్‌ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. అదే ఖరారైతే ఆయన పాదయాత్ర పది, 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత లోకేష్‌పై ఉండడంతో ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోజనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 


చంద్రబాబుపై సీఐడీ పోలీసులు మోపిన కేసులకు సంబంధించి, సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు వెలువడ వచ్చని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒక వేళ తీర్పు మరికొద్ది రోజులు జాప్యమైనా లోకేశ్‌ పాదయాత్ర 24నే ప్రారంభం అవుతుందని, ఇందులో మార్పేమీ ఉండబోదని టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈ మేరకు పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. అయితే లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్య అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


చంద్రబాబు అరెస్ట్‌లో ఆగిన యువగళం
నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ ఏడాది జనవరిలో తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రాయలసీమలో పూర్తి చేసుకుని.. కోస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత దాదాపు 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది.  ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఆగింది. దీంతో లోకేష్ రాజమహేంద్రవరం, ఢిల్లీకి పరిమితం అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని భావించినా వాయిదా వేసుకున్నారు.


ఇప్పటివరకు 2852 కిలోమీటర్లు నడిచిన లోకేష్
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేస్ నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే పాదయాత్రను ముగించే ఆలోచనలో ఉన్నారు.  ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.