Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించారు. నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా తదుపరి ప్రణాళికకు రూపకల్పన చేశారు.


ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా సోమవారం ఏపీ బంద్ నిర్వహించారు. ఈ బంద్‌కు మద్దతిచ్చి, నిరసనల్లో పాల్గొన్న జనసేన, సీపీఐ కార్యకర్తలకు లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిరసనల్లో పాల్గొన్నారని, ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు నేతలను గృహనిర్బంధం చేసినా కార్యకర్తలు రోడ్ల మీదకు  వచ్చి నిరసన తెలపడం గొప్ప విషయం అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి రెచ్చిపోయిందని, నిరసనలను అణిచివేసేందుకు, బంద్‌ను అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడిందని విమర్శించారు. 


చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని, చంద్రబాబు అరెస్టును యావత్తు రాష్ట్రం ఖండించిందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని లోకేశ్‌ తెలిపారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం జైలు సమీపంలోని విద్యానగర్‌ విడిది కేంద్రం వద్ద లోకేశ్‌ మీడియాతో మాట్లాడనున్నారు.


ALSO READ: ప్రజలకు బహిరంగ లేఖ
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీ ప్రజలకు ఓ లేఖ రాశారు. అందులో ‘బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఏపీ ప్రజలకు ఇలా రాస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతగానో పాటుపడ్డారు. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నా.. ఏరోజు కూడా మీకు విశ్రాంతి అంటే తెలియదు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో ఉంటాయి. ఆయన సేవల్ని అందుకుని ప్రేరణ పొందిన వారిని చూస్తూ పెరిగాను. సాయం అందుకున్న వారి హృదయపూర్వక కృతజ్ఞతలతో మీ మనసు ఆనందంతో నిండిపోయింది. 


నేను కూడా నాన్న గొప్ప మార్గం, విధానాల నుంచి ప్రేరణ పొందాను. అదే విధంగా అమెరికాలో విలాసవంతమైన ఉద్యోగాన్ని వదిలి మీ అడుగుజాడల్లో నడిచేందుకు వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ మన దేశం, రాజ్యాంగం, విధానాలు, సూత్రాలపై చాలా నమ్మకం ఉంది.


కానీ నేడు మా నాన్న తాను చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం వస్తోంది. నా రక్తం మరిగిపోతోంది. రాజకీయ పగను తీర్చుకునేందుకు ఏ హద్దులు, లోతులు లేవా? రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన మా నాన్న లాంటి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి?. రాజకీయ పగ, విధ్వేష రాజకీయాలకు దిగకపోవడమే ఆయన చేసిన తప్పిదమా. మీరు ప్రజల అభివృద్ధి, సంక్షేమం, ఎదిగేందుకు అవకాశాలపై ఆలోచినందుకు ఇలా జరిగిందా? 


నేటి పరిస్థితిని చూస్తే ద్రోహంగా కనిపిస్తుంది. కానీ మా నాన్న పోరాటయోధుడు, నేనూ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల కోసం కోసం తిరుగులేని దృఢ సంకల్పంతో పోరాడుతా. ఆ పోరాటంలో మీరు నాతో చేతులు కలపండి’ అంటూ తండ్రి చంద్రబాబు పరిస్థితిపై ఏపీ ప్రజలకు నారా లోకేష్ ఈ పోస్ట్ చేశారు.