చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ రాజమహేంద్రవరం క్యాంప్ సైట్ వద్ద జ‌గ‌నాసుర ద‌హ‌నం కార్యక్రమం నిర్వహించారు. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నినాదాలు చేస్తూ ‘‘సైకో పోవాలి’’ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి  ద‌హ‌నం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా ఇంఛార్జులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


సమన్వయ భేటీ తర్వాత పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రెస్ మీట్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తు, ప్ర‌జ‌ల‌ భ‌ద్ర‌త కోసం టిడిపి-జ‌న‌సేన క‌లిశాయ‌ని, వైసీపీ చెడు పోవాలంటే టిడిపి-జ‌న‌సేన రావాల్సిందేన‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో టిడిపి-జ‌న‌సేన స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీ అనంత‌రం  మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలనూ బెదిరిస్తున్నార‌ని, అన్ని పార్టీల నేతలనూ ఇబ్బంది పెడుతున్నార‌ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిందేన‌న్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల‌నివ్వబోనని గతంలోనే చెప్పాన‌ని, రాష్ట్ర అభివృద్ధే త‌మ‌కు ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు. అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో టీడీపీకి మద్దతిచ్చామ‌న్నారు. 


వైసీపీకి తాము వ్య‌తిరేకం కాద‌ని, వైసీపీ అవ‌లంబిస్తున్న అరాచ‌క‌ విధానాలకు మాత్రమే వ్యతిరేకమ‌న్నారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా ప్ర‌మాద‌క‌ర‌ మ‌ద్యం అమ్ముతున్నార‌ని మండిప‌డ్డారు. ఈ రాష్ట్రానికి తెగులులా ప‌ట్టిపీడిస్తోన్న‌ వైసీపీ పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం అని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టార‌ని, సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామ‌ని, రాష్ట్ర‌ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మ‌ళ్లీ ఇక్క‌డే కలిశామ‌న్నారు. టిడిపి-జ‌న‌సేన ఉమ్మడి మ్యానిఫెస్టో, కలిసి పనిచేయ‌డం, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై లోతుగా చ‌ర్చించామ‌న్నారు. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే అంశ‌మే త‌మ ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా సాగింద‌న్నారు.  రాష్ట్ర ప్రజలకు భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాల‌న్నారు. రెండు పార్టీల మధ్య ఉండే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించుకుంటామ‌ని, ఉమ్మడి కార్యాచరణపై మరో వారం, పది రోజుల్లో స్పష్టత ఇస్తామ‌ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్ల‌డించారు. 


వ‌చ్చేది టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే -నారా లోకేశ్


విజయదశమి రోజున టిడిపి-జ‌న‌సేన క‌ల‌యిక రాష్ట్రానికి మేలు చేయ‌నుంద‌ని, వ‌చ్చేది టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌ని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్య‌క్తం చేశారు. 2014లో రాజ‌ధాని కూడా లేని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని న‌డిపించేందుకు స‌మ‌ర్థుడైన నాయ‌కుడు కావాల‌ని  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారు అన్ కండిష‌న‌ల్‌గా టిడిపికి మ‌ద్ద‌తు ఇవ్వ‌గా ప్ర‌భుత్వం ఏర్ప‌డి, అనేక సంక్షేమ -అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌యోజనాల కోస‌మే టిడిపి-జ‌న‌సేన మ‌రోసారి క‌లిసి సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయ‌ని ప్ర‌క‌టించారు. 


నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్‌ పాల‌న‌లో సామాజిక అన్యాయం జ‌రిగింద‌న్నారు. వైసీపీ పాల‌కులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,  బీసీల‌కి తీరని ద్రోహం చేశార‌ని ఆరోపించారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నార‌ని, బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశార‌న్నారు. ద‌ళిత డాక్ట‌ర్ సుధాక‌ర్ నుంచి డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం వ‌ర‌కూ ఎంద‌రో ఎస్సీల‌ని వైకాపా స‌ర్కారు వెంటాడి వేధించి చంపేసింద‌న్నారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని ఆరోపించారు. ఇస్లాంలో ఆత్మ‌హ‌త్య పాపం అని, వైసీపీ నేతల వేధింపులు తాళ‌లేక‌ ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నార‌ని ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. 


తీవ్ర క‌రువుతో 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతుల్ని ఆదుకునే చ‌ర్య‌లు స‌ర్కారు తీసుకోలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంద‌న్నారు. ప్రాజెక్టులు మూల‌న‌ప‌డ్డాయ‌ని, మిగులుజ‌లాలు స‌ముద్రంలోక‌లిశాయ‌ని, రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీ 3వ స్థానంలో ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డీజిల్ పెట్రోల్ ధ‌ర‌లు, క‌రెంటు చార్జీలు, ప‌న్నులు విప‌రీతంగా పెంచేసి ప్ర‌జ‌ల‌పై  మోయ‌లేని భారం వేశార‌ని లోకేష్ మండిప‌డ్డారు. అధికారంలోకి వ‌స్తే 2.50 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్, సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలు ఊడ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. 


నాలుగున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేద‌ని, ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ‌రు మాట్లాడినా వేధిస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, అరాచ‌క స‌ర్కారుపై ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడేందుకు టిడిపి-జ‌న‌సేన క‌లిశాయ‌ని, నవంబరు 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు. ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలన ఉంటుంద‌న్నారు. నవంబరు 1 నుంచి ఉమ్మ‌డి మ్యానిఫెస్టో ప్రకటించి, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామ‌న్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని, రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని 3 తీర్మానాలు చేశామ‌ని ప్ర‌క‌టించారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్ప‌డి రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జాసంక్షేమానికి పాటుప‌డుతుంద‌న్నారు.