Pithapuram News: మాజీ మంత్రి ముద్రగడ చెప్పినట్టుగానే పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఇవాళ ప్రకటించారు. దీనికి అధికారిక ప్రక్రియ ఉంటుందని అది త్వరలోనే పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. 


కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన పద్మనాభం.... ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేశారు. ఆ టైంలో పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పద్మనాభం... ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓడిపోతారని అభిప్రాయపడ్డారు. ఒక వేళ పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే మాత్రం తాను తన పేరు మార్చుకుంటానంటూ ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ గెలిస్తే మాత్రం తన పేరు ముద్రగడ పద్మనాభం కాదని.... పద్మనాభ రెడ్డి అంటూ అప్పట్లో చెప్పడం సంచలనం అయింది. 
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచి పద్మనాభంపై ట్రోల్స్ నడుస్తున్నాయి. పద్మనాభం నామకరణ మహోత్సవం అంటూ ఆయనపై సెటైర్లు వేశారు. 
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టిన ముద్రగడ తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్ కోసం అధికారులను సంప్రదిస్తానని పేర్కొన్నారు. ఒకసారి అధికారికంగా అనుమతులు వస్తే తన పేరు మారిపోతుందని అన్నారు.