రోజురోజుకు క్షీణిస్తున్న తెలుగుదేశం పార్టీని పైకి తేవడానికి ఉపయోగిస్తున్న జాకీలు విరిగిపోతున్నాయి అంటూ జనసేనను ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ టూరిజం శాఖ మంత్రి అర్కే రోజా పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గుమ్ములూరు, బూరుగుపూడి గ్రామాల్లో ఆమె పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీపై సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి గత 3 సంవత్సరాలుగా వివిధ ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయభేరిని చూసి తలవొంచుకుంటున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 3 సంవత్సరాల్లోనే దాదాపుగా అమలు చేయగలిగిందని అన్నారు. ప్రభుత్వం భీమవరంలో చారిత్రాత్మక అల్లూరి సీతారామరాజు కార్యక్రమం సక్సెస్ కావడాన్ని చూసి భీమ్లా నాయక్ కు మతి భ్రమించిందని రోజా ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ల కాంబినేషన్ లో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని రోజా పిలుపునిచ్చారు.
సుమారు రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), వైఎస్సార్ హెల్త్ సెంటర్‌తో పాటు, జగనన్న కాలనీ – పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మించిన ఇంటిని ప్రారంభించారు. బూరుగుపూడి అల్లూరి సీతారామరాజు కాలనీలో కంటే సత్తిబాబు, వినయ్‌తేజ రూ.4.50 లక్షలతో నిర్మించిన జక్కంపూడి రాజా కల్యాణ వేదికను ప్రారంభించారు. అక్కడున్న సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై రోజా ప్రధాని మోదీతో, చిరంజీవితో దిగిన సెల్ఫీలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజా ప్రధాని మోదీ, సీఎం జగన్‌తో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవితో విడిగా మరో సెల్ఫీ దిగారు. మంత్రి రోజా దిగిన సెల్ఫీలు ట్విటర్ లో వైరల్ అయ్యాయి. రోజా, చిరంజీవి కలయికలో వచ్చిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరు ఇలా పబ్లిక్ ఈవెంట్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.