సంఘ విద్రోహ శక్తుల విధ్వంసం ద్వారా ప్రభుత్వాన్ని భయపెట్టి తమ లక్ష్యాన్ని చేరకుండా ఆపడం ఎవరి తరమూ కాదని ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి హింసలు, అశాంతి నెలకొల్పడాన్ని ఖండించారు. కోనసీమ జిల్లాకు పేరు మార్చడంలో స్థానిక మంత్రిగా తన పాత్ర కూడా ఉందని భావించిన అల్లరి మూకలు తన ఇంటిని కూడా తగలబెట్టారని వాపోయారు. అమలాపురంలో చేసిన ఈ విధ్వంస కాండ స్థానిక ప్రజలు చేసింది కాదని, అంబాజీ పేట లాంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారి పని అని విశ్వరూప్ అన్నారు.


కోనసీమ జిల్లా పేరు మార్చడానికి వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో హింసాత్మకంగా మారిందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. వారు జై కోనసీమ, జై జనసేన అంటూ నినదిస్తూ వచ్చారని అన్నారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు నిరసనల కోసం తమ కౌన్సిలర్లకు పిలుపునిచ్చారని, కానీ వారు పార్టీపై గౌరవంతో వెళ్లలేదని అన్నారు. 


ఈ విధ్వంసంలో పాల్గొన్న తాలుకూ వీడియో రికార్డులు అన్నీ తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా అందులో పాలుపంచుకున్న ఏ ఒక్కర్నీ వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. కారకులైన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.


తన ఇంటిని నాశనం చేయడం గురించి మాట్లాడుతూ.. ఇంటికి నిప్పు అంటించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల అందరూ గర్వించాలని, ఒకవేళ పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాకు పేరు మార్పు నేపథ్యంలో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని విశ్వరూప్ ఆరోపించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని మీడియా ద్వారా మంత్రి కోరారు.


ప్రస్తుతం కాకినాడలో మంత్రి విశ్వరూప్
తన ఇల్లు తగలబెట్టడంతో వెంటనే పోలీసులు మంత్రిని అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జీఆర్టీ రెస్టారెంట్‌లో తలదాచుకున్నారు. మరి కొద్దిసేపట్లో విశ్వరూప్ అమలాపురం రానున్నారు.


అమలాపురంలో రాత్రి 11 గంటల నుంచి భారీ కుండపోత వర్షం కురిసింది. ఈదురు గాలుల దాటికి అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో భార్యతో కలిసి దగ్ధం అయిన ఇంటిని పరిశీలించిన రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. ఇంటిని చూసేందుకు మనసు ఒప్పడం లేదని విశ్వరూప్ సతీమణి బేబీ మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. 


ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాత్రి నుంచి కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భారీ బలగాలను రప్పించి అమలాపురంలో మోహరించారు. నిరసనకారుల దాడిలో ఎర్ర వంతెన వద్ద రెండు బస్సులను దగ్ధం చేశారు. వాటిని ప్రధాన రోడ్డు మార్గం నుంచి ఆర్టీసీ అధికారులు తొలగించారు. ప్రస్తుతం అమలాపురంలో కర్ఫ్యూ అమలవుతోంది.