ఆరేడు గంటల పాటు అట్టుడికిపోయిన అమలాపురం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ముందస్తుగా పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు రేండ్‌ డీఐజీ పాలరాజు రాత్రి నుంచి అమలాపురంలోనే ఉండి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. 


అణువణువూ తనిఖీ


కోనసీమ అంతటా కర్ఫ్యూ కొనసాగుతోంది. నిన్న అగ్ని గుండలా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయట వ్యక్తులను ఎవర్నీ అనుమతి ఇవ్వడం లేదు. 


రూట్ మార్చిన పోలీసులు


అమలాపురం వెళ్తున్న అన్ని బస్సులను మార్గమధ్యలోనే నిలిపేశారు పోలీసులు. విశాఖ నుంచి వెళ్లే బస్సులను కాకినాడలో... రాజమండ్రి నుంచి వెళ్లే బస్సులను రావులపాలెంలో ఆపేస్తున్నారు. పాలరాజు వెంట కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రస్తోగీ ఉన్నారు. 


వర్షంతో కూల్ కూల్


నిన్న అర్థరాత్రి వరకు హాట్‌హాట్‌గా ఉన్న అమలాపురాన్ని కుండపోత వర్షం కూల్ చేసింది. రాత్రి 11 గంటల నుంచి భారీ కుండపోత వర్షం... ఈదురు గాలుల వాతావరణాన్ని చల్లబరిచింది. ఈ భారీ గాలివానకు అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. వర్షం పడటంతో ఆందోళనకారులు రోడ్లపై నుంచి వెళ్లిపోయారు.


విశ్వరూప్‌ భార్య ఎమోషనల్


పరిస్థితులు చక్కబడిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తన భార్యతో కలిసి దగ్ధం అయిన ఇంటిని పరిశీలించారు రవాణా శాఖ మంత్రి విశ్వరూప్. ఇంటిని చూసేందుకు మనసు ఒప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విశ్వరూప్ సతీమణి బేబీ మీనాక్షి. ఆ పరిస్థితులు చూసి ఏమోషనల్‌ అయ్యారు. 


ఇతర ప్రాంతాల్లో బలగాలు


ఘటన జరిగిన తర్వాత నుంచి కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారుల దాడిలో ఎర్ర వంతెన వద్ద దగ్ధమైన రెండు బస్సులను ప్రధాన రోడ్డు మార్గం నుంచి తొలగించారు ఆర్టీసీ అధికారులు.


కోనసీమ జిల్లా పేరు మార్చొద్దన్న డిమాండ్‌తో ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నిన్న సాయంత్ర ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అమలాపురంలో పోలీసులపై దాడి చేసిన నిరసనకారులు తర్వాత కనిపించిన వాహనాలను తగులపెట్టారు. తర్వాత ప్రజాప్రతినిధులు ఇళ్లను టార్గెట్‌ చేసుకున్నారు. మంత్రి విశ్వరూప్, అధికార పార్టీ ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. 


ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా అమలాపురంలో భయభ్రాంతులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజలు సంయమనం పాటించాలని విజప్తి చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. రాత్రి 12 గంటల తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీని ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కోనసీమలో కర్ఫ్యూ ప్రకటించారు.