కోనసీమ జిల్లా పేరు మార్చడంపై చిన్నాగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత మంత్రి ఇంటిని ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి దూసుకెళ్లారు.
144 సెక్షన్ అమల్లో ఉన్నా...
కలెక్టరేట్ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది.
పోలీసుల లాఠీ ఛార్జ్‌తో
ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా.. ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. లాఠీ దెబ్బలతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది.
ధ్వంసం రచన మొదలైంది అప్పుడే
కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఉద్యమం చేస్తున్న నిరసనకారుల దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసిన అనంతరం కలెక్టరేట్ పక్కనే ఉన్న బస్సులు, వాహనాలను టార్గెట్‌గా చేసుకున్నారు ఆందోళనకారులు. ఓ ప్రైవేటు కాలేజీ బస్సులను దహనం చేశారు. అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇలా దొరికిన వాటిని ధ్వంసం చేస్తూ వెళ్లిపోయారు.
మంత్రి ఇల్లు టార్గెట్
అయినా ఆగ్రహం చల్లారని ఆందోళనకారులు అమలాపురంలో ఉన్న మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈలోపే ఆందోళనకారులు ఆ ఇంటిని చుట్టు ముట్టి నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇంటి ఆవరణంలో ఉన్న ఫర్నీచర్ దహనమైంది. అక్కడే నిలిపి ఉంచిన మూడు కార్లను ధ్వంసం చేశారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్‌పై కూడా దారి చేశారు.
ఎమ్మెల్యే ఇంటిపైకి..
అదే ఊపులో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి కూడా ఆందోళనకారులు దాడికి వెళ్లారు. ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడి జరిగే సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేరు. ఆందోళనకారుల ఎత్తులను పసిగట్టిన పోలీసులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్స్‌ను సురక్షితంగా రాజమండ్రి తరలించారు.
ఇంత విధ్వంసం జరిగినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. వేలమంది యువకులు రోడ్లపైనే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను తరలించారు. అమలాపురంలోని ఆందోళనజరుగుతున్న ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారు.