కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా పేరును మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్లంతా ఇవాళ కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ముట్టడి రక్తసిక్తమైంది. 


ప్రశాంతంగా ఉండే కోన సీమ జిల్లా ఎర్రబారింది. జిల్లా పేరు మార్చడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆందోళనకారుల ఎత్తులను ముందే పసిగట్టిన పోలీసులు భారీగా మోహరించారు. ఎవర్నీ కలెక్టరేట్‌వైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేశారు. అయినా పరిస్థితులు చేయిదాటిపోయాయి. 


కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రమైన అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోనసీమ జిల్లా పేరును మార్చుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటీసు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వర్గాలు కోనసీమ జేఏసీగా ఏర్పడి ఆందోళన చేపట్టాయి. 


ఇన్నాళ్లూ అనేక విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆ వర్గాలు ఇప్పుడు నేరుగా కార్యరంగంలోకి దూకాయి. మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది కోనసీమ జేఏసీ. పోలీసులు కూడా వారిని అడ్డుకునేందుకు భారీగా బలగాలను మోహరించారు. ఇరు వర్గాల పోటాపోటీ ఎత్తుగడలతో అమలాపురం చిన్న రణరంగాన్ని తలపించింది. 


ఇలాంటి పరిస్థితిని ముందే పసిగట్టిన పోలీసులు 30 సెక్షన్ అమలు చేశారు. తర్వాత సోమవారం నుంచి 144 సెక్షన్ అమలు చేస్తూ వచ్చారు. అమలాపురం పట్టణం నలుమూలల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వేరే మార్గాల్లో కొందరు యువకులు పట్టణంలోకి ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిని చదరగొట్టే ప్రయత్నం చేశారు. 


ఈ క్రమంలో ఆందోళన అదుపు తప్పింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఇరవైమంది పోలీసులు సిబ్బంది గాయపడింది. గాయపడిన వారిలో ఎస్పీ గన్‌మెన్‌, ఎస్సై, సీఐలు కూడా ఉన్నారు. అమలాపురం డీఎస్పీ స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. 


ఇలా ఇది వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. ఆందోళనకారులు ఆగ్రహంతో అధికార పార్టీ లీడర్ల ఇళ్లపై దాడులుచేయడం మొదలు పెట్టారు. తొలుత మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి చేసి... ఆ ఇంటికి నిప్పు పెట్టారు. తర్వాత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి కూడా వెళ్లారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 


దీనిపై రియాక్ట్ అయిన ప్రభుత్వం.. సంయమనం పాటించాలని విజప్తి చేసింది. ఇదంతా కొన్ని వర్గాలు కావాలని చేస్తున్న ఆందోళనగా ఉందని అభిప్రాయపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.