Telugu Wedding Muhurtham Dates in May 2023: దాదాపు నెల రోజులుగా కనిపించని కళ్యాణ వేడుకలు మళ్లీ కాంతులీననున్నాయి. నెల రోజులుగా మూఢం కారణంగా నిలియిపోయిన పెళ్లి వేడుకలు మూఢం పోయి వైశాఖ శుద్ధదశమి రానుండడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. శనివారంతో మౌఢ్యమి(మూఢం) ముగుస్తుండగా ఇప్పటికే శుభముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న పెళ్లింటివారు అన్ని ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా దాదాపు కళ్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. మే ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుస బలమైన మహూర్తాలు ఉండడంతో చాలా మంది వివాహాలు, గృహప్రవేశాలు, శంఖుస్థాపనలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు.
నెలలో నాలుగు రోజులే మినహాయింపు..
మే నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా పెళ్లిళ్లకు కళ్యాణ మండపాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కేటరింగ్‌లు, షామియానాలు, ఇతర ఏర్పాట్లు విషయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందంటున్నారు. అయితే ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో మాత్రం ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈకారణంతో ప్రస్తుతం కళ్యాణ మండపాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి..
ఇప్పుడు కాకుంటే మరో రెండు నెలలు బ్రేక్..
మే మాసం అంతా వరుస మంచి ముహూర్తాలు ఉండగా జూన్ నెలలో మాత్రం శుభకార్యాలకు బ్రేక్ పడనుందని చెబుతున్నారు పండితులు. జూన్ 18వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయని, అయితే జూన్ నెల 19 నుంచి ఆషాడ మాసం ఎంటర్ అవ్వడంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాడమాసం జూలై 18 వరకు కొనసాగడంతోపాటు ఆతరువాత శ్రావణ మాసం, జూలై 19 నుంచి ఆగస్టు 17 వరకు అధికశ్రావణ మాసం కొనసాగనుంది. ఈరెండు నెలల వ్యవధిలో శుభముహూర్తాలు లేకపోగా ముఖ్యంగా పెళ్లిళ్లుకు బ్రేక్ పడనుంది. అయితే కొన్ని శుభకార్యక్రమాలకు మాత్రం వెసులు బాటు ఉంటుందని చెబుతున్నారు.
కళ్యాణ వేడుకలకు సరికొత్తపోకడలు..
ఇదివరకు పెళ్లిళ్లు అంటే కేవలం బ్యాండ్ మేళాలు, భాజాభజంత్రీలు, పూలమండపాలు, వీడియో షూటింగ్‌లు ఇటువంటివి చాలా కామన్.. అయితే ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. వివాహ ముహూర్తానికి ముందే సంగీత్ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ షూట్‌ల కోసం ఇతర ప్రాంతాలకు ఫొటోగ్రాఫర్లతో వధూవరులు వెళ్లడం, సినీ సంగీత విభావరులు ఇలా సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతన్నారు చాలామంది. అంతేకాకుండా చాలా సంపన్నులైతే కళ్యాణ మండపాల్లో కాకుండా ఖాళీ ప్రదేశాలకు ప్రాధాన్యనిచ్చి అందులో సినిమా సెట్టింగ్‌లకు మించిన స్థాయిలో సెట్టింగ్‌లు నిర్మించడం చేస్తున్నారు. సినిమాటిక్‌గా వధూవరులచే స్పెషల్ సాంగ్స్ రూపకల్పన చేసి అవి ముందుగానే సోషల్‌మీడియాలో విడుదల చేయడం, కళ్యాణ వేదికపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై ప్రదర్శించడం ఇలా విభిన్నంగా వేడుకను నిర్వహిస్తున్నారు.
పెరుగుతోన్న కొనుగోళ్లు...
ప్రస్తుతం బంగారం ధర పెరిగిన కళ్యాణ ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో బంగారం కొనుగోళ్లు బాగా పెరిగాయి. అంతే కాకుండా వస్త్రదుకాణాలు కూడా కళకళలాడుతున్నాయి. ముహూర్తాలు దగ్గర పడుతున్నవారు అప్పుడు దుకణాల్లో షాపింగ్‌లు చేస్తూ నిమగ్నమయ్యారు. దీంతో పలు చోట్ల వాణిజ్య సముదాయాలు కళకళలాడుతున్నాయి.