Andhra Pradesh News: సరిహద్దు తగాదాతో మొదలైంది. కొన్నేళ్లుగా కక్షపూరిత వాతావరణం నెలకొంది. మరింకే కారణముందో తెలియదు కానీ ఒక రాత్రి రెండు కుటుంబాల మధ్య వివాదం రేగింది. చినికి చినికి కొట్లాటకు దారితీసింది. ఈలోపు కరెంటు పోయింది. అంతే చిమ్మచీకట్లో ఒక కుటుంబంపై మరో కుటుంబానికి చెందిన వ్యక్తి గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కడతేర్చాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది..


రెండు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు ముగ్గురు హత్యకు దారితీసింది. ప్రత్యర్ధులను నిలవరించే పరిస్థితి కనిపించడంలేదన్న అసహనంతో పక్కా ప్లాన్డ్‌ ప్రకారం ముగ్గుర్ని అంతమొందించారు. చెరువును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణతో ముదిరిన వివాదం ముగ్గురిని దారుణంగా హత్య చేసే పరిస్థితి తలెత్తింది. ఎనిమిది మంది తీవ్ర గాయాలపాల్చేసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.. 


కారణాలేవైనా ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పరిధిలో వరుస ఘటనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారాయి. గ్రామాల్లో జరుగుతున్న వరుస ఘటనలు జిల్లా ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. చిన్నస్థాయిలో మొదలైన వివాదమైనా అది కక్షపూరిత వాతావరణాన్ని తీసుకువచ్చి ఆ తరువాత హత్యోదంతానికి దారితీస్తోంది.. ఈ తరహా వివాదాలు మొదలైంతే ఏస్థాయిలో ఎటువంటి హత్యాకాండ మొదలవుతుందోనని పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 


రాజకీయ కక్షలు 


గ్రామాల్లో రాజకీయ పాతకక్షల కారణంగా కూడా ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. గ్రామాల్లో రాజకీయంగా ఆధిపత్యపోరు ప్రధాన కారణంగా ఇటీవల చోటుచేసుకున్న పలు ఘర్షణలకు ఆజ్యం పోసిందని చెబుతున్నారు. భూతగాదాలు, పాత కక్షలు వెరసి రాజకీయ రంగు పులుముకుని వివాదాలు తెరలేస్తున్నాయని, ఇదే అదనుగా విచక్షణ కోల్పోయేలా చేసి హత్యోదంతాలకు తెరలేపుతున్నారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు హద్దులు దాటి హత్యలకు దారితీస్తున్నాయని పోలీసులు నిర్ధారిస్తున్నారు..


బైండోవర్లు, కేసులు నమోదు 
గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు వివాదాలు నేపథ్యంలో గ్రామాల్లో శాంతికమిటీలు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వరుస వివాదాలుకు దిగుతున్నవారిని గుర్తించి వారికి బైండోవర్లు చేస్తున్నారు. వరుస వివాదాలు పురికొల్పుతూ ఘర్షణలకు దిగి అనేక కేసులు నమోదు అయిన వారిపై రౌడీ షీట్లు తెరుస్తున్నారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఎవ్వరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కాకినాడ జిల్లా ఎస్పీ హెచ్చరించారు.