Kovvuru Railway Station :కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చింది రైల్వే శాఖ. గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ముఖ్యమైన రైళ్లు తిరుమల ఎక్స్ ప్రెస్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లకు 23.12.2025 అంటే మంగళవారం నుండి కొవ్వూరులో హాల్ట్ ఇచ్చారు.
తిరుమల ఎక్స్ ప్రెస్ -18521/18522
ట్రైన్ నెంబర్ 18521 తిరుమల ఎక్స్ ప్రెస్ గోదావరి జిల్లాల నుంచి తిరుమల పుణ్యక్షేత్రం వెళ్లాలనుకునే వారికి చాలా అందుబాటులో ఉండే రైలు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ ప్రయాణించే ఈ రైలును ప్రస్తుతం కడప వరకూ పొడిగించారు. కోవిడ్‌కు ముందు ఈ ట్రైన్ కొవ్వూరులో ఆగేది. ఆ తర్వాత హాల్ట్ తీసేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడసాగారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా మంగళవారం నుంచి ఈ రైలుకు కొవ్వూరులో హాల్ట్ కల్పించారు. ప్రతీ రోజు విశాఖ-కడప వెళ్లే 18521 తిరుమల ఎక్స్ ప్రెస్ సాయంత్రం 05:23 కి కొవ్వూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ వెళ్లే 18522 తిరుమల ఎక్స్ ప్రెస్ తెల్లవారుఝాము 05:04 కి కొవ్వూరు చేరుకుంటుంది.
మచిలీపట్నం -వైజాగ్ ఎక్స్ ప్రెస్ -17219/17220
కొవ్వూరు ప్రజలు డిమాండ్ చేస్తున్న మరో ముఖ్యమైన రైలు మచిలీట్నం-వైజాగ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్. దానికి కూడా కొవ్వూరులో మంగళవారం నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు అధికారులు. మచిలీ పట్నం నుంచి వైజాగ్ వెళ్లే 17219 ఎక్స్ ప్రెస్ అర్ధరాత్రి 1:13కి చేరుకోగా వైజాగ్ నుంచి మచిలీపట్నం వెళ్లే 17220 ఎక్స్ ప్రెస్ మధ్య రాత్రి 01:23 కి కొవ్వూరులో ఆగుతుంది.
కోవిడ్‌కు ముందు 36 రైళ్లు ఆగే కొవ్వూరు రైల్వే స్టేషన్
కోవిడ్ కు ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో 36 రైళ్లు ఆగేవి. కోవిడ్ సమయంలో వాటిని రద్దు చేసి కేవలం కొన్ని ప్యాసింజర్ మెము రైళ్ళకే ఇక్కడ హాల్టింగ్ ఇచ్చారు. అయితే గోదావరి పుష్కరాలు దగ్గరకు వస్తున్న దృష్ట్యా కొవ్వూరు స్టేషన్ లో ఎక్కువ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రాజమండ్రి ఎంపీ పురంధ్రీశ్వరి కోరడం తో దక్షిణ మధ్య రైల్వే GM శ్రీ వాత్సవ ఈ రెండు రైళ్లకు కొవ్వూరులో ఆగే సౌకర్యం కల్పించారు. దీనితో సంతోషించిన కొవ్వూరు ప్రజలు భవిష్యత్ లో మరిన్ని రైళ్లకు కూడాతమ ఊళ్ళో హాల్టింగ్ కల్పిస్తారని ఆశిస్తున్నారు.