Konaseema District News: ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాల పర్వం మొదలైంది. రహస్యంగా వివిధ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రలోభాలకు రెడీ అయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నాయకులు చీరలు పంచిన విషయం బయటికి వచ్చింది. చీరలు తీసుకున్న మహిళలు అందరూ అవి తమకు వద్దని విసిరికొట్టడం సంచలనంగా మారింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ళ గ్రామం ఆదర్శగ్రామంగా నిలిచిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాక పినపళ్ళ గ్రామంలోనే కాక మిగతా గ్రామాలలో కూడా ఇదే మార్పు వచ్చి తిరుగుబాటు చేస్తే అవినీతి చేసే నాయకుడు ఒకడు కూడా వుండడని ఆ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ తెలిపారు. కుట్రలు కుతంత్రాలు చేసే వైసీపీ చిల్లర రాజకీయాలకు ఇక చెల్లవని ఆమె అన్నారు. ఓటు అనే ఆయుధంతో మనం సమాధానం చెప్పాలని పినపళ్ళ గ్రామ ప్రజలకు సర్పంచ్ హితవు పలికారు.


ఇదే పోరాటంతో ఇదే మార్పుతో ఇదే స్ఫూర్తితో పినపళ్ళ గ్రామాన్ని అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తాము పని చేస్తున్నామని సర్పంచ్ సంగీత సుభాష్ చెప్పారు. ఆమెకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని పినపళ్ళ గ్రామ ప్రజలు తెలిపారు. ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


పినపళ్ళ గడ్డ జనసేన అడ్డా అని.. జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకే తమ ఓటు అని ప్రజలు తేల్చి చెప్పారు. సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ ని భరీ మెజారిటీతో గెలిపించాలని సుభాష్ పిలుపు ఇచ్చారు.


అతని వ్యాఖ్యల వల్లే


కొత్తపేటలో జనసేన పార్టీ మహిళలపై వైసీపీ లీడర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందునే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇంటింటా పంపిణీ చేసిన చీరలను వైసీపీ నాయకుని ఇంటికి తీసుకెళ్ళి జనసేన వీర మహిళలు విసిరి కొట్టారు. జనసేనకు సపోర్ట్ చేస్తున్న ఆడవాళ్ళను చీరలతోని కొని పారదొబ్బండి అని వైసీపీ లీడర్ అన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ లీడర్ పంచిన చీరలను ఆ  అతని ఇంటికి వెళ్లి గుమ్మంలో వీర మహిళలు విసిరికొట్టారు.