Prabhala Theertham 2023: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జగ్గన్నతోట ప్రభల తీర్ధంలో ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు భక్తులు పోతెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పరష్కరించుకుని కనుమ నాడు.. నిర్వహించే ప్రభల తీర్ధాలు అంబాజీపేట మండలంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని మొగలపల్లి పంచాయతీ పరిధిలోని నిర్వహించిన ప్రభల తీర్ధ మహోత్సవం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలిరాగా ఒకే చోట కొలువైన ఏకాదశ రుద్రులను దర్శించుకున్నారు. తండోపతండాలుగా వస్తూ స్వామి వార్లను దర్శించుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వరి చేలు మధ్య నుండి పయనించే రమ్యమైన దృశ్యాలను చూసేందుకు రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు.
ఏకాదశ రుద్రుల్లో గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం రుద్ర ప్రభలు జగ్గన్నతోట తీర్చనకు వచ్చే సమయంలో దారిపొడవునా పిల్ల కాలువలను, పచ్చని వరి చేలను తొక్కుకుంటూ, నిండుగా పారుతున్న ప్రధాన పంటకాలువ ( అప్పర కౌశిక) నుండి ప్రభలను స్థానికులు తమ భుజాలపై మోసుకుంటూ వచ్చారు. మరల తిరిగి వెళ్లే సన్నివేశాలను చూసేవారికి ఒళ్ళు జలదరించింది. ఎక్కడా ఏవిధమైన అపశృతి దొర్లకుండా ప్రభలను భుజాలపై మోసుకుంటూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకువస్తున్న దృశ్యాలను జీవితంలో ఒక్కసారి అయినా కనులారా చూడాల్సిందే. జగ్గన్నతోటలో కొలువై ఉన్న ఏకాదశ రుద్రులను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు దర్శించుకున్నారు.
జగ్గన్నతోటలో కొలువుదీరిన ఏకాదశరుద్రులు వీరే...
మొసలపల్లి మధు మాసాంత భోగేశ్వర స్వామి, ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, వక్కలంక - కాశీ విశ్వేశ్వర స్వామి, వ్యాఘేశ్వరం- వ్యాఘేశ్వర స్వామి, పుల్లేటికుర్రు- అభినవ వ్యాఘేశ్వర స్వామి, కె. పెదపూడి-మేనకేశ్వరస్వామి, గంగలకుర్రు- శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం- వీరేశ్వరస్వామి, పాలగుమ్మి- చెన్న మల్లేశ్వరస్వామి, నేదునూరు - శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి వార్లు కొలువు దీరారు.
రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రభలు...
ప్రభల తీర్థ మహోత్సవాల్లో కొలువుదీరే ప్రభలలో వాకల గురువు (52 అడుగుల ఎత్తు), తొండవరం (51 అడుగుల ఎత్తు) ప్రభలు రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి. ఇంత ఎత్తైన ప్రభలను తయారు చేయడం, వాటిని యువకులు తమ భుజస్కందాలపై ఎత్తుకుని కొబ్బరి తోటలు, అప్పర కౌశికలు దాటుకుంటూ సాకుర్రు గున్నేపల్లి సెంటర్లో తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకురావడం ఎంతో శ్రమతో కూడిన పని. అయితే భగవదనుగ్రహంతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అవలీలగా మోసుకుపోతుంటారు యువకులు. అలాగే వీటికి బాసటగా పిల్ల ప్రభలను కొలువు తీరుస్తారు. వీటిని స్వయంగా 10 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు తయారు చేస్తారు. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వెళ్లేవారు ముందుగా వీటిని దర్శించుకోవడం జరుగుతోంది. అలాగే మండలంలో మండలంలోని చిరుతపూడి డాము సమీపంలో జరిగే ప్రభల తీర్థంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రభలు కొలువు తీరాయి.
ఆకట్టుకున్న కాంతారా.. సినీ హీరోల ప్రభలు..
ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలోని పలు ఉత్సవ ప్రభల్లో సినీ హీరోల చిత్రాలతో ఊరేగించారు. అయితే ఇవి తీర్థ మహోత్సవాలకి వెళ్లకపోయినప్పటికీ ఊరేగింపులో భాగంగా ఈ ప్రభలను అభిమానులు ఊరేగించినట్లు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలతో తయారు చేసిన ప్రభలను ఊరేగించడం కనిపించింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో తయారుచేసిన కాంతారా ప్రభ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.