రాష్ట్రంలో జిల్లాల విభజన తరువాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా పుంజుకుంటోంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ బడితే అక్కడ లే అవుట్లు, వెంచర్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాలు అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి తీసుకోస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ, మొత్తం 11 మండలాల పరిధిలో 120 రెవిన్యూ గ్రామాలు అడా పరిధి లోకి రానున్నాయి. 


కఠినతరం కానున్న నిబంధనలు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(అడా )- ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అడా రాకతో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కు ఇకపై నిబంధనలు కఠినతరం కానున్నాయి. అడా ఏర్పాటు తో స్థానిక సంస్థల అధికార పరిధి తగ్గుతోంది. ప్రత్యేకంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లే ఔట్స్, గృహ నిర్మాణాల పంచాయతి పరిధి దాటి అనుమతులు ఇస్తోంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ పై అప్పటి ఆర్థిక మంత్రి యనుముల రామకృష్ణుడు అమలాపురంలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటన చేశారు. అది కార్యరూపం దాల్చలేదు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కోనసీమను గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తేస్తూ జీవో జారీ చేసింది. దీనిపై అమలాపురం రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. 


కోనసీమ నైసర్గిక స్వరూపాన్ని బట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంచిది కాదంటూ కోర్టులో వాదనలు వినిపించింది. దీంతో హైకోర్టు కోనసీమను గుడాలో చేర్చవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోప్రభుత్వం వెనక్కు తగ్గిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తెరపై తీసుకురావడంతో  ముఖ్యంగా నాన్ అప్రూవల్ లేఔట్లకు చెల్లి చీటీ రాసిందని చెప్పవచ్చు. ప్రతి లే అవుట్ కు 40 అడుగుల రోడ్లు తప్పనిసరిగా ఉండాలి. లేఔట్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే వరకు కొంత భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి  మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు నిబంధనలను ఇందులో ఉంటాయి. 


విచ్చలవిడిగా అనధికార లేఔట్లు..
అమలాపురం కేంద్రంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటించడంతో అమలాపురం పరిసర ప్రాంతాలలో భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా అనధికార లే అవుట్లు వెలుస్తున్నాయి. వీటిలో 90 శాతం పైగా లేఔట్లకు అనుమతి లేకపోవడం గమనార్హం. దీంతో చాలామంది కొనుగోలుదారులు పూర్తి అయోమయంలోనే అవసరాన్ని బట్టి భూములు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుండగా లేఅవుట్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండానే అయినా కాడికి దోచేస్తున్నారు రియాల్టర్లు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేయడంతో అనధికార లే అవుట్లు నిర్వాహకులకు గుండెల్లో గుబులు పట్టుకుంది.


పదవుల కోసం చిగురిస్తున్న ఆశలు..
మొన్నటి వరకు ఎమ్మెల్సీ పదవులకోసం ఆశపడి భంగపడ్డ పలువురు వైసీపీ నాయకులుకు ఇప్పుడు అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ద్వారా పదవుల ఆశలు కలుగుతున్నాయి.. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు ఒక ఛైర్మన్‌, కొంతమంది సభ్యులు ఉంటారు. ఈనేపథ్యంలో పలు పదవులు దక్కే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ సారి ఏది ఏమైనా కనీసం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ పదవిని దక్కించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.