Konaseema Tourism: అడ్వెంచర్ టూరిజం అన‌గానే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్,  గోవా వంటి ప్రాంతాలు గుర్తుకు వ‌స్తాయి.. ఈ ప్రాంతాలు అడ్వెంచర్ టూరిజంకు ప్రసిద్ధి కూడా ఇప్ప‌డు విభిన్న‌ భౌగోళిక ప‌రిస్థితులు ఉన్న కోన‌సీమ‌లో కూడా అడ్వెంచ‌ర్ టూరిజానికి ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.

మూడు పాయ‌లుగా విడిపోయి స‌ముద్రంలో క‌లిసే గౌత‌మి, వ‌శిష్ట‌, వైన‌తేయ న‌దీపాయ‌లు, అంత‌ర్వేది, ఓడ‌ల‌రేవు, యానాం ప్రాంతాల వ‌ద్ద న‌దీసాగ‌ర సంగ‌మాలు ఉన్నాయి. స‌ముద్రం బ్యాక్ వాట‌ర్‌తో నిండి ఉండే ఉప్పుటేర్లు.. ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి ఆత్రేయపురం మీదుగా ప్ర‌వ‌హించే అతి విశాల‌మైన కెనాల్స్‌.. వీటితోపాటు బీచ్‌ల పొడ‌వునా అరుదైన ఇసుక‌తెన్నులు కనిపిస్తాయి. ఇలా అనేక ప్ర‌త్యేక‌త‌ల‌తో నిండి ఉన్న ప్రాంతం కోన‌సీమ కావ‌డంతో ఇప్పుడు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో అడ్వెంచ‌ర్ టూరిజం కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తేన్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ తెలిపారు.

విభిన్నంగా అడ్వెంచ‌ర్ టూరిజంఅడ్వెంచ‌ర్ టూరిజం అంటే ప‌ర్యాట‌కులు సాహసోపేతమైన, ఉత్తేజకరమైన, సవాలుతో కూడిన కార్యకలాపాలలో పాల్గొనే పర్యాటక రూపంగా చెబుతుంటారు. ఇది సాధారణ టూరిస్ట్ ప్లేస్‌ల‌కు భిన్నంగా, శారీరక శ్రమ, సాహసం, కొత్త అనుభవాలను అందిస్తుందంటారు. ఈ రకమైన టూరిజంలో కొంత మేరకు రిస్క్ ఉన్నా నేచర్‌ను స‌హ‌జ సిద్ధంగా ఆస్వాదించేందుకు చాలా మంది ఈ అడ్వెంచ‌ర్ టూరిజాన్ని ఇష్ట‌ప‌డుతుంటారు.

ఉదాహ‌ర‌ణ‌కు ట్రెక్కింగ్‌, రాఫ్టింగ్‌, క్యాంపింగ్‌, సాండ్ క్లైంబింగ్‌, పారా గ్లైండింగ్, బోట్ రైడ్ ఇలా అనేక ర‌కాలుగా అడ్వెంచ‌ర్ టూరిజానికి ఉన్న ప్ర‌త్యేక‌త‌లు. అయితే ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన కోన‌సీమ ప్రాంతంలో ఇప్ప‌టికే దీనిపై నిపుణుల‌తో ప‌రిశీల‌న చేసిన అధికారులు ఇక్క‌డ ఈ అడ్వెంచ‌ర్ టూరిజం అనువైన‌దేన‌ని అభివృద్ధి దిశ‌గా అడుగులు వేశారు.. 

కోన‌సీమలోని ఈ ప్రాంతాల్లో అభివృద్ధి.. 

దిండి ఆత్రేయపురం అంతర్వేది బీచ్ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరు పాయింట్లు గుర్తించి టెండర్లు పిలిచారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి అధికారులు ఆరు బోటింగ్ పాయింట్లకు సంబంధించిన ఏజెన్సీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఇప్ప‌టికే సమావేశం నిర్వహించి ఇటీవల రూపొందించి సమర్పించిన సమగ్ర ప్రతిపాదనలపై సమీక్షించారు.

వశిష్ట గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రత్యేకమైన నదీముఖ ద్వారం వద్ద బోటింగ్ స్పోర్ట్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకపరంగా ఆదాయాన్ని గణనీయంగా ఆర్జించ‌డం, అంతర్వేది ఏటా వేలమంది యాత్రికులను ఆకర్షిస్తుందని అయితే, పర్యాటక మౌలిక సదుపాయాలు క‌ల్పించ‌డం, గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి నదుల శాఖలు కాటన్ బ్యారేజీ వద్ద ఉద్భవించి కోనసీమ జిల్లా గుండా ప్రవహించి చివరకు బంగాళాఖాతం సముద్రంలోనికి ప్రవేశిస్తున్న న‌దీపాయ‌ల్లో బోట్ రైడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కాటన్ బ్యారేజీ భాగంలోని బొబ్బర్లంక హెడ్ లాక్‌ల నుంచి ప్రారంభమై ప్రధాన కాలువ బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం మండలంలోని లొల్ల వరకు దాదాపు 13 కి.మీ పొడవునా ప్రవహిస్తున్న చోట బోటు విహార యాత్ర‌లు ఏర్పాటు చేయనున్నారు. 

లోల్ల లాకులకు అత్యంత సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శించి ప్రకృతిని ఆస్వాదించనున్నారు. లోల్లలాకుల సమీపంలో చిన్న ద్వీపాలు, కాలువలు, లాకులు, కొబ్బరి చెట్లు మొదలైనవి కనిపిస్తాయి. ఈ సుందర ప్రకృతి దృశ్యాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి సహాయపడతాయని స్థానిక ఆధ్యాత్మిక క్షేత్రాలు కొత్త అనుభూతి ఇస్తాయని పర్యాటకులు స్పీడ్ బోట్లు, ఫుడ్ కోర్టులు, బోటింగ్ స్పోర్ట్స్ అనువుగా తీర్చిదిద్దాల‌ని క‌లెక్ట‌ర్ వారికి సూచించారు. ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనివ్వ‌డంతోపాటు బోట్‌రైడ్‌ల విష‌యంలో నియ‌మాలు కచ్చిత‌త్వంగా పాటించేందుకు సంబంధిత శాఖ‌ల ద్వ‌ారా ప్ర‌ణాళిక సిద్ధం చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ మ‌హేష్‌కుమార్ వెల్ల‌డించారు.