టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాకినాడ జిల్లాలో సందడి చేశారు. కోడి పందేల బరుల వద్ద ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల ప్రాంతంలో నిర్వహించిన కోడిపందాలను వీక్షించేందుకు దర్శకుడు వర్మ వచ్చారు. తన స్నేహితుని ఆహ్వానం మేరకు కాకినాడ వచ్చినట్లు రాంగోపాల్ వర్మ తెలిపారు. కోడి పందేల గ్యాలరీలో కూర్చుని కోడి పందాలను ఆసక్తిగా వీక్షించారు డైరెక్టర్ వర్మ. కోడిపందేల నిర్వహణపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.


రాంగోపాల్ వర్మ వలసపాకల ప్రాంతానికి వచ్చారని తెలియడంతో స్థానికులు భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు అక్కడికి వచ్చారు. దర్శకుడు వర్మను పలకరించేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు ఎగబడ్డారు. కాకినాడ రూరల్ వలసపాకల నుంచి నేరుగా కాకినాడ సిటీ ఎమ్మల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ని కలిసేందుకు ఆయన నివాసానికి వర్మ వెళ్లారు. అయితే కాకినాడలో రాంగోపాల్ వర్మపై జనసైనికులు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 


కోడి పందేలు జరుగుతున్న కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు వచ్చిన దర్శకుడు వర్మ నిర్వాహకుల కోరిక మేరకు కోడిని పట్టుకుని పందేలు మొదలుపెట్టారు. అనంతరం నిర్వాహకులు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా కోడి పందేల కప్పును ఆవిష్కరింపచేశారు. స్థానికుల కోరికను కాదనలేక వర్మ కోడిపందేల కప్పును ఆవిష్కరించారు. కోడిపందేల వద్ద వర్మ ఉన్నంతసేపు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు శివ, రక్తచరిత్ర మూవీస్ సాంగ్స్ ప్లే చేస్తూ పందెం రాయుళ్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. 


కొడాలి నాని విత్ వివి వినాయక్...
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ దర్శకులు వివి వినాయక్ అన్నారు. తాను దర్శకత్వం వహించిన హిందీ చిత్రం మార్చిలో లో విడుదల కానుందని తెలిపారు. కొడాలి నాని వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని, ఆయనతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని  ఘనంగా స్వాగతం పలికారు.  


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.  సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని, చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించానని, ప్రదర్శనలు చాలా బాగున్నాయన్నారు. ఈ ఏడాది మార్చిలో తాను డైరెక్ట్ చేసిన, హిందీ సినిమా విడుదలవుతుందని, హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తానని ఆయన చెప్పారు. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని,  నాని తనకెంతో ఇష్టమైన వ్యక్తి ఎప్పుడంటే అప్పుడు సినిమా  చేసేందుకు నేను సిద్ధమని  వినాయక్‌ ప్రకటించారు.