ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రైతుల ఆత్మహత్యలపై జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గోదావరి(Godavari) జిల్లాల్లోనే 73 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆందోళన చెందారు. సాగును నమ్ముకుంటే చావే గతి అన్నట్టు పరిస్థితి ఉందని విమర్శించారు పవన్ కల్యాణ్
ఉభయగోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతులను పరామర్శిస్తానంటున్నారు పవన్ కల్యాణ్. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఆయా ఫ్యామిలీలను పరామర్శించి ధైర్యం చెప్పబోతున్నారు.
కుటుంబ పెద్ద కోల్పోయిన తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ఫ్యామిలీలకు అండగా ఉంటామంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కొంతైనా ఊరట కల్పించేందుకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించిన పవన్ కల్యాణ్... త్వరలోనే గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానంటున్నారు. ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెప్పి లక్ష రూపాయల చెక్ అందజేయనున్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతుకు ఎలాంటి సాయం అందట్లేదని ఆరోపించిన పవన్ కల్యాణ్ వారికు జనసేన అండగా ఉంటుందన్నారు.