Janasena MLC Nagababu | పిఠాపురం: నాగబాబు పర్యటనతో పిఠాపురంలో కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు, వర్సెస్ జనసేన కార్యకర్తలుగా పరిస్థితి మారిపోయింది. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నాగబాబు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ అంటూ నినాదాలు చేశాయి. జనసైనికులు సైతం అదే ఊపుతో జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు అని నినాదాలు చేసుకుంటూ బల ప్రదర్శన చేశారు.

ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించింది ప్రజలే అని, ఇతరుల పాత్ర లేదని గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం తాజాగా కనిపిస్తోంది. నాగబాబు పిఠాపురం పర్యటనలలో అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు,  మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు బల ప్రదర్శన చేస్తుండటంతో ఓ దశలో టీడీపీ, జనసైనికుల మధ్య తోపులాట సైతం జరిగింది.  

నాగబాబు పర్యటనలో 150 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారని తెలుస్తోంది. పిఠాపురంలో ప్రజలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించారని, జనసేనాని విజయంలో ప్రజలదే కీలకపాత్ర అని నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆయన ప్రచారంలో ప్రభావం చూపుతున్నాయి. ఇతరుల ప్రభావం లేదని చెప్పడం, మాజీ ఎమ్మెల్యే వర్మకు క్రెడిట్ దక్కకుండా చేయడమేనని టీడీపీ కార్యకర్తల అభిప్రాయం. మరోవైపు వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడం ఆయన అభిమానులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పవన్ కళ్యాణ్ ను హైలైట్ చేయాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారని కూటమిలోని టీడీపీ శ్రేణులు, వర్మ మద్దతుదారులు బహిరంగంగా సైతం ప్రకటనలు చేయం తెలిసిందే. నాగబాబు పర్యటనలో ఇదే తమకు ఛాన్స్ అన్నట్లుగా టీడీపీ శ్రేణులు వీలు చిక్కినప్పుడల్లా బల ప్రదర్శనకు దిగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

తొలిరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శ్రీకారం..

ఎమ్మెల్సీ అయ్యాక నాగబాబు తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా రూ. 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని నాగబాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో మంచినీటి సరఫరా కేంద్రంలో రూ. 65.24 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో నాగబాబుతో పాటు ఏపీ టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.