AP Elections 2024: రాజమండ్రి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన కొనసాగనుంది. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో జనసేన (Janasena Party) సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం (TDP) పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.
మూడు దశలుగా పవన్ కళ్యాణ్ పర్యటనలు
పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో జనసేన ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయి. రెండో పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మూడో దశలో జనసేన పవన్ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కళ్యాణ్ మూడుసార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్దం చేస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని చాలాకాలం కిందటే నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ బీజేపీ సైతం సై అంటే, సీట్ల పంపకాలపై ఇబ్బంది తలెత్తకపోతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్ ను గద్దె దించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇదివరకే పవన్, చంద్రబాబు పలుమార్లు సమావేశమై పొత్తులపై, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించడం తెలిసిందే. కానీ బీజేపీ తమతో జతకడితే తిరుగుండదని భావించి, సీట్ల పంపకాలు జరగలేదన్న వాదన సైతం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడంపై చర్చలు జరిగాయి. కానీ చర్చల్లో ఏం తేల్చారు, టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా లాంటి ఏ విషయం బయటకు రాలేదు. అదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం ఢిల్లీకి వెళ్లొచ్చారు. ఏపీ సమస్యలు, నిధులపై చర్చించారా, లేక వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు తెలపడానికి ఢిల్లీకి వెళ్లారా అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా వైసీపీ ఎంపీలు కేంద్రానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు నెరవేరకపోవడం వైసీపీకి ప్రతికూల అంశంగా మారనుంది. ఒంటరిగానే బరిలోకి దిగుతామని సీఎం జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు ఇదివరకే స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను జగన్ మార్చుతున్నారు.