Pawan Kalyan Speech At Kakinada Meeting: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 5గం.కు కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర నిర్వహించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆనంతరం సర్పవరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వారాహి నుంచి ప్రసంగిస్తున్నారు. జనవాణిలో భాగంగా బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూనే వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. 


జూన్ 14న అన్నవరంలో సత్యదేవున్ని దర్శించుకున్నాక పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి యాత్ర ప్రారంభించారు. ఆపై కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ తనను అసెంబ్లీకి పంపించాలంటూ ప్రజలను కోరారు. ఏపీ ప్రభుత్వ అవినీతిపై విమర్శించారు. అన్ని ప్రాంతాల్లో వైసీపీ చేస్తున్న అవినీతిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు.  ఆపై జూన్ 16న పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని పవన్ టార్గెట్ చేశారు. అవినీతి సీఎం, బటన్ నొక్కే సీఎం అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. గూండాలు, రౌడీలు, కబ్జాదారుల పాలనలలో ఉండటం తనకు చిరాకు అని, జనసేనకు ఓట్లు వేసి వైసీపీని సాగనంపాలి అని ప్రజలను కోరారు.



శనివారం రాత్రి (జూన్ 17) కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. అందుకోసం కొందరు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారని సమాచారం ఉందని కాకినాడలో జనసేన నేతలతో అన్నారు.






కొనసాగుతున్న వారాహి యాత్ర 
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కత్తిపూడి సభ, పిఠాపురంలో బహిరంగ సభలు నిర్వహించారు. నిన్న ఉదయం (జూన్ 17) 10 గంటలకు కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనవాణిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కంటితడి పెట్టారు. జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తనకు వచ్చే పెన్షన్ ను నిలిపివేసిందని, ఆయన పడుతున్న కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టారు. దివ్యాంగుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


దివ్యాంగుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. 2021లో పెన్షన్ తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్, చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పిన దివ్యాంగుడు శ్రీనివాస్.. ఎక్కువ కరెంట్ బిల్లు అని సాకు చూపించి ఉద్దేశపూర్వకంగా పింఛన్ తొలగించారని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆరోపించారు. పలావుతో తిండి తిను, చేపల కూర నీకు అవసరమా అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారని జనవాణిలో భాగంగా పవన్ కు ఆవేదన చెప్పుకున్నారు శ్రీనివాస్. 35 కేజీల రేషన్ బియ్యం వచ్చేదని, అది కూడా బంద్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. మేం తినేది ఈ బియ్యం, అసలే మా అమ్మకు షుగర్ ఉంది, థైరాయిడ్ కూడా ఉందని తన కుమారుడు అడిగితే మళ్లీ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారని దివ్యాంగుడి తల్లి కనకం కన్నీటి పర్యంతమయ్యారు.